
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం మొదలైన వాటి ధరలు నెమ్మదించడంతో ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) 13 నెలల కనిష్టమైన 0.85 శాతానికి పరిమితమైంది. గతేడాది మార్చిలో 0.26 శాతంగా నమోదైన తర్వాత డబ్ల్యూపీఐ ఇంత తక్కువ స్థాయికి దిగి రావడం ఇదే ప్రథమం. ఇది తాజా మార్చిలో 2.05 శాతంగా, గతేడాది ఏప్రిల్‌లో 1.19 శాతంగా నమోదైంది.
డేటా ప్రకారం ఆహార ఉత్పత్తుల ధరలు 0.86 శాతం, కూరగాయల రేట్లు 18.26 శాతం స్థాయిలో క్షీణించడంతో ప్రతిద్రవ్యోల్బణం నమోదైంది. సీక్వెన్షియల్‌గా విమాన ఇంధనం, కిరోసిన్ మొదలైన వాటి ధరలు తగ్గడంతో ఇంధనాలు.. విద్యుత్ రేట్లు 2.18 శాతం క్షీణించాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా నమోదైంది.
సానుకూల బేస్ ఎఫెక్ట్ కారణంగా రాబోయే నెలల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని బార్‌క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. రుతుపవనాలు ముందే తాకడం, వర్షపాతం సాధారణ స్థాయికన్నా ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు పంట దిగుబడులకు, ఆహార ద్రవ్యోల్బణానికి సానుకూలాంశాలని ఇక్రా సీనియర్ ఎకనమిస్ట్ రాహుల్ అగ్రవాల్ తెలిపారు.