
ఎల్రక్టానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడి
భారతదేశపు సావరీన్ కృత్రిమ మేథ (ఏఐ) నమూనాపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమిట్ నాటికి దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఫౌండేషనల్ మోడల్ సిద్ధం కాగలదని కృష్ణన్ వివరించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఏ దేశమైనా పూర్తిగా సొంత మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వనరులతో రూపొందించే ఏఐ మోడల్‌ను సావరీన్ ఏఐ మోడల్‌గా వ్యవహరిస్తారు. కృత్రిమ మేథ ప్రభావాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అందరూ పాలుపంచుకునేందుకు వీలుండే ప్లాట్‌ఫాంలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణన్ చెప్పారు.
ఏఐలోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, 38,000 జీపీయూలతో (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్) కంప్యూట్ మౌలిక సదుపాయాలను భారత్ వేగంగా పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అవసరాలకు తగ్గట్లు, రంగాలవారీగా పనికొచ్చే చిన్న మోడల్స్ రూపకల్పనను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఇలాంటివి ఉత్పాదకతను పెంచుకునేందుకు సహాయకరంగా ఉంటాయని కృష్ణన్ వివరించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కీలక లక్ష్యాల్లో స్వదేశీ జీపీయూ రూపకల్పన కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు.