ఆకాశ వీధిలో బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌దే హవా | Indian low-cost carrier IndiGo is stock hits record high | Sakshi
Sakshi News home page

ఆకాశ వీధిలో బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌దే హవా

Aug 24 2024 5:12 AM | Updated on Aug 24 2024 5:12 AM

Indian low-cost carrier IndiGo is stock hits record high

దేశీయంగా సీట్ల సామర్థ్ధ్యంలో 71% వాటా 

అగ్రస్థానంలో ఇండిగో

దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌–ఎల్‌సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్‌ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్‌ వాటా అత్యధికంగా ఉన్న టాప్‌ 10 దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్‌సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. 

అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్‌సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్‌ఎయిర్, ఇండిగో, ఈజీజెట్‌ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది.  

సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. 
ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్‌ సరీ్వస్‌ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్‌ఎస్‌సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్‌ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్‌ మార్కెట్‌లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్‌ఎస్‌సీలతో పోలిస్తే ఎల్‌సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. 

రయాన్‌ఎయిర్, ఈజీజెట్, విజ్‌ ఎయిర్‌ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్‌ఎస్‌సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్‌ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్‌ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్‌ మొదలైనవి ఉన్నాయి. 

అమెరికా, జర్మనీ, జపాన్‌ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్‌ఎస్‌సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్‌ సరీ్వస్‌ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్‌ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్‌ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్‌సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది.  

ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. 
మార్కెట్‌ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్‌ చెకిన్‌లు, సీట్‌ అప్‌గ్రేడ్‌లు, ఎక్స్‌ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. 

ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్‌ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్‌ఎయిర్‌ గ్రూప్‌ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్‌ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్‌ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం.     

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement