చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ల జోరు  | India Tech Revolution From rural to urban India | Sakshi
Sakshi News home page

చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ల జోరు 

Jun 21 2025 5:38 AM | Updated on Jun 21 2025 8:11 AM

India Tech Revolution From rural to urban India

విస్తృతంగా 5జీ సేవలు, చౌకగా ఫోన్లు లభిస్తుండటమే కారణం 

మీడియాటెక్‌ ఇండియా ఎండీ అంకు జైన్‌ వెల్లడి 

కొత్త డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ ఆవిష్కరణ 

న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ సెమీకండక్టర్‌ దిగ్గజం మీడియాటెక్‌ ఇండియా ఎండీ అంకు జైన్‌ వెల్లడించారు. 5జీ సేవల విస్తరణ, స్మార్ట్‌ఫోన్లు చౌకగా లభిస్తుండటం, కనెక్టెడ్‌ ఉపకరణాలకు డిమాండ్‌ నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ ఉపకరణాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, టెక్నాలజీ రంగం, యువత వృద్ధి చోదకాలుగా ఉండబోతున్నాయని జైన్‌ చెప్పారు.

నెక్ట్స్‌–జనరేషన్‌ స్మార్ట్‌ఫోన్ల సామర్థ్యాలను పెంచే డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. టీవీలు, స్పీకర్లు, ఫ్రిజ్‌లు మొదలైన ఉపకరణాల్లోనూ ఏఐ చిప్‌సెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్‌ హోమ్‌ మార్కెట్లో కూడా తమకు ప్రాధాన్యం పెరుగుతోందని జైన్‌ చెప్పారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకెళ్తోందని తెలిపారు. రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల కొరతపై స్పందిస్తూ తమ సరఫరా వ్యవస్థకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేసుకుంటున్నామని జైన్‌ వివరించారు.  

కొత్త విభాగాల్లోకి విస్తరణ .. 
ఆటోమోటివ్, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌లాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరిస్తున్నామని జైన్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ టూ వీలర్లకు 4జీ స్మార్ట్‌ క్లస్టర్లను రూపొందించేందుకు జియోథింగ్స్‌తో జట్టు కట్టామని, స్కోడా స్లావియా, టాటా పంచ్‌ ఈవీలాంటి కార్లకు ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టంలపైనా దృష్టి పెడుతున్నామని చెప్పారు. భారత్‌లో శాటిలైట్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వ్యవస్థ విస్తరించే కొద్దీ తమ చిప్‌సెట్స్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు, ఇంజనీరింగ్‌ సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు మీడియాటెక్‌ కట్టుబడి ఉందని చెప్పారు. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ మార్కెట్లో మీడియాటెక్‌ సంస్థకు 45 శాతం, క్వాల్‌కామ్‌కి 32 శాతం వాటా ఉంది. 2004లో మీడియాటెక్‌ భారత్‌లో తమ తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరు, నోయిడా కార్యాలయాల్లో 1,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement