రెండొంతుల అమ్మకాలు అక్కడే
ఆన్‌లైన్ షాపింగ్ విస్తరణతో అవకాశాలు
న్యూఢిల్లీ: డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లు (డీ2సీ) మెట్రో నగరాలను దాటి, ద్వితీయ (టైర్–2), తృతీయ శ్రేణి (టైర్–3) నగరాల్లో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. ప్రముఖ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీ2సీ బ్రాండ్లకు వచి్చన కొత్త ఆర్డర్లలో 66 శాతం వాటా ఈ చిన్న పట్టణాల నుంచే ఉండడం విశేషం. ఆన్‌లైన్ షాపింగ్‌లో వస్తున్న మార్పులను ఇది ప్రతిఫలిస్తోంది.
2025–26లో డీ2సీ బ్రాండ్లకు నికరంగా పెరిగిన గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ/ స్థూల ఉత్పత్తుల విక్రయ విలువ)లో 60 శాతం చిన్న నగరాల నుంచే ఉంది. మెట్రో నగరాలకు వెలుపల డీ2సీ బ్రాండ్లకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. సంప్రదాయ బ్రాండ్ల మాదిరి డీలర్లు, హోల్‌సేలర్లు, రిటైల్ సంస్థల ప్రమేయం లేకుండా.. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఉత్పత్తులను డీ2సీ బ్రాండ్లుగా చెబుతారు.
చిన్న నగరాలే ఆశాకిరణం..
డీ2సీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు చూపించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలి్చతే ఆర్డర్ల పరంగా 33 శాతం, విక్రయాల విలువలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 10–12 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.1.11 లక్షల కోట్లు) ఉన్న భారత డీ2సీ మార్కెట్, 2030 నాటికి 60 బిలియన్ డాలర్లకు (రూ.5.58 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా నాలుగు రెట్లు పెరగనుంది. డెలివరీ వ్యవస్థలో మెరుగుదల వల్ల ఆర్డర్లు వెనక్కి రావడం 39 శాతం నుంచి 21 శాతానికి తగ్గనున్నట్టు పేర్కొంది.
టెక్నాలజీతో చేరువ..
ఆర్డర్ల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ), చాట్ ఆధారిత సేవల వాడకం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవం వల్ల బ్రాండ్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆన్‌లైన్ వ్యాపారం ఇకపై కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాబోదని, మారుమూల ప్రాంతాలు వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని విశ్లేషించింది. సుమారు 40 కోట్ల ఆర్డర్ల డేటాను విశ్లేషించి యూనికామర్స్ ఈ నివేదికను రూపొందించింది.


