లండన్: బ్రిటన్ (యూకే) ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలను ‘పొగాకు రహితంగా’మార్చే చారిత్రక బిల్లుకు యూకే పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. జనవరి 1, 2009 తర్వాత జన్మించిన ఎవరైనా సరే.. తమ జీవితకాలంలో ఇకపై చట్టబద్ధంగా సిగరెట్ కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ కఠినమైన చట్టాన్ని అధికారికంగా తీసుకొచ్చింది.
కఠినంగా కొత్త చట్టం
‘టొబాకో అండ్ వేప్స్ బిల్లు’ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.. ప్రస్తుతం 17 ఏళ్ల వయసులో ఉన్న యువతను, ఆ తర్వాత పుట్టిన వారిని ధూమపానానికి శాశ్వతంగా దూరం చేయడమే. ఈ నిర్ణయం దేశ ఆరోగ్య రంగంలో ఒక సువర్ణాధ్యాయం అని ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ అభివర్ణించారు. భవిష్యత్ తరాలను ప్రాణాంతక వ్యసనాల నుంచి రక్షించడానికి, దేశంలో మొట్టమొదటి పొగరహిత తరాన్ని సృష్టించడానికి ఈ చట్టం ఒక కవచంలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వేపింగ్‌పైనా ఉక్కుపాదం
కేవలం సిగరెట్ల పైనే కాకుండా, ఈ-సిగరెట్లు (వేపింగ్) పట్ల కూడా బ్రిటన్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త చట్టం అమలులోకి రాగానే పాఠశాలలు, ఆస్పత్రుల వెలుపల, చిన్నపిల్లల పార్కుల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. అలాగే పిల్లలను ఆకర్షించే రంగురంగుల డిజైన్లు, ఫ్లేవర్లతో కూడిన వేపింగ్ ఉత్పత్తుల ప్యాకేజింగ్, అమ్మకాలను కట్టడి చేయనున్నారు. యువతను ఆకర్షించే డిస్పోజబుల్ వేప్స్ అమ్మకాలను గత ఏడాది జూన్‌లోనే నిషేధించిన ప్రభుత్వం, ఇప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో కూడా వాటిపై ఆంక్షలు కఠినతరం చేసింది.
ఏటా 75 వేల మరణాలు
ఇంగ్లండ్‌లో ఏటా దాదాపు 75,000 మంది కేవలం ధూమపానం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని, మొత్తం మరణాల్లో ఇది పావు శాతం అని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్) గణాంకాలు చెబుతున్నాయి. దీనిని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ అడుగు వేసింది. కాగా, 2022లో న్యూజిలాండ్, గత ఏడాది నవంబర్‌లో మాల్దీవులు సైతం ఇలాంటి తరహా చట్టాలనే తీసుకొచ్చాయి. యువతలో సిగరెట్ అలవాటును సమూలంగా నిర్మూలించే దిశగా యూకే పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


