న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా భానుడి ప్రతాపానికి సాధారణ జీవనం స్తంభించిపోతోంది. ఒకవైపు పర్యాటకులు వడదెబ్బకు గురవుతుంటే, మరోవైపు రాత్రుళ్లు సైతం వేడి గాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
ఢిల్లీలో ‘వాటర్ బెల్స్’..
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు, ప్రతి 45-60 నిమిషాలకు ఒకసారి విధిగా ‘వాటర్ బెల్’ మోగించాలని పాఠశాలలను ఆదేశించింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, ప్రయాగ్‌రాజ్ లో ఏకంగా 44.6 డిగ్రీలు నమోదు కాగా, 26 జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఆరుగురు పర్యాటకులు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. ఎండల భయానికి రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్‌పూర్ వంటి పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.
రాత్రి పూట కూడా వీడని ‘వేడి’
సాధారణంగా పగలు ఎండలు మండినా, రాత్రికి వాతావరణం చల్లబడుతుంది. కానీ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సహా మరో ఎనిమిది జిల్లాల్లో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5°C నుంచి 6.4°C మేర పెరగడంతో వాతావరణ శాఖ ‘వార్మ్ నైట్’ (వెచ్చని రాత్రి) అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పైగా నమోదవుతూ, వేడి గాలులు వీస్తుండటం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది.
మున్ముందు మరింత ఉక్కపోత
భగభగమండే ఎండల నుంచి ఉపశమనం కోసం రైల్వే స్టేషన్లు, రోడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ (43.8°C) స్టేషన్‌లో మిస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగా, బీహార్ (42°C) లో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై నీళ్లు చల్లుతోంది. వాతావరణ అంచనాల ప్రకారం.. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు హీట్ వేవ్ కొనసాగనుంది. అదే సమయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.
ఇది కూడా చదవండి: ఛార్ ధామ్‌లో చిరు వ్యాపారం.. లైఫు సెట్టు!


