19.6 శాతంగా ‘ట్యాక్స్–జీడీపీ’ నిష్పత్తి
హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియాల కంటే మెరుగు
డిజిటల్ విప్లవం, పన్ను సంస్కరణలతో ఖజానాకు కాసుల వర్షం
అగ్రరాజ్యాల సరసన చేరాలంటే ఇంకా పరుగు తప్పదు
అమెరికా (25.6%), జర్మనీ (38%) లతో భారత్ పోటీ
‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక యవనికపై భారత్ తనదైన ముద్ర వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ వడివడిగా పరుగులు పెడుతుండటంతో పాటు.. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీనితో పన్ను వసూళ్ల విషయంలో పలు అభివృద్ధి చెందుతున్న దేశాలను భారత్ వెనక్కి నెట్టిందని ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ తన తాజా పరిశోధన నివేదికలో స్పష్టం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్నుల ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం 19.6 శాతానికి చేరినట్లు తెలిపింది. డిజిటలైజేషన్, పన్నుల సరళీకరణ విధానాలే ఈ వృద్ధికి ఇంధనంగా మారాయని నివేదిక విశ్లేషించింది.
సంస్కరణల ఫలితమే ఈ జోరు...
పన్నుల వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని నివేదిక తేల్చిచెప్పింది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, పన్ను విధానాల్లో పారదర్శకత పెంచడం, కార్పొరేట్ పన్నుల హేతుబదీ్ధకరణ, అనధికారిక ఆర్థిక వ్యవస్థను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం వంటి ఈ చర్యల వల్ల రానున్న రోజుల్లో పన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ’వివాద్ సే విశ్వాస్’ వంటి పథకాలు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు .. పారదర్శకతను పెంచాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ‘నూతన ఆదాయ పన్ను చట్టం–2025’ దేశ పన్నుల చరిత్రలో మరో కీలక మలుపు కానుందని నివేదిక అంచనా వేసింది.
అగ్రరాజ్యాలకు ఆమడ దూరంలోనే..
నివేదిక ప్రకారం పన్ను వసూళ్లలో పురోగతి సాధించినప్పటికీ .. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ ఇంకా వెనుకబడే ఉంది. ఆయా దేశాల పన్ను ఆదాయ నిష్పత్తితో పోలిస్తే మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ అగ్రరాజ్యం జర్మనీలో ట్యాక్స్–టు–జీడీపీ రేషియో ఏకంగా 38 శాతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 25.6 శాతంగా నమోదైంది. వీటితో పోలిస్తే 19.6 శాతంతో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అయితే మన జనాభా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ అంతరాన్ని తగ్గించే సత్తా భారత్‌కు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఆసియాలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాల కంటే భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుండటం విశేషం. ఈ విషయంలో మనం ఇతర వర్ధమాన మార్కెట్లయిన హాంకాంగ్ (13.1%), మలేషియా (13.1%), ఇండోనేషియా (12.0%) కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఆయా దేశాలకంటే మన పన్ను వసూళ్ల నిష్పత్తి ఎక్కువగా ఉండటం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో పన్నుల ఆదాయం తగ్గినప్పటికీ, ఆ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది.


