డిసెంబర్‌లో నెమ్మదించిన ‘సేవలు’ | India services sector activity expands at slower rate in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో నెమ్మదించిన ‘సేవలు’

Jan 7 2021 4:02 AM | Updated on Jan 7 2021 4:02 AM

India services sector activity expands at slower rate in December - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం డిసెంబర్‌లో మందగించింది. ఇందుకు సంబంధించి బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 52.3గా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ సూచీ 53.7 వద్ద ఉంది. అమ్మకాల్లో వృద్ధి మందగించడం దీనికి ప్రధానకారణమని ఆర్థిక సమాచార సేవల దిగ్గజ సంస్థ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రాతిపదికన డిసెంబర్‌ వరకూ వరుసగా మూడవనెల బిజినెస్‌ యాక్టివిటీ సూచీ వృద్ధి ధోరణిలోనే ఉంది.  బలహీన వ్యాపార ఆశావాద పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్‌లో ఉపాధి కల్పన తగ్గిందని, అమ్మకాలు మూడు నెలల కనిష్టానికి పడ్డాయనీ పోలీనా డీ లిమా వివరించారు. బ్రిటన్‌ కొత్త స్ట్రెయిన్, దీనితో తిరిగి గ్లోబల్‌ కోవిడ్‌–19 ప్రయాణపు ఆంక్షలు, డిమాండ్‌ పరిస్థితులపై ఆయా అంశాల ప్రతికూల ప్రభావం,  2020 చివరిలో భారత్‌ సేవల రంగాన్ని నెమ్మదింపజేసి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సేవలు, తయారీ రెండూ కలిపినా తగ్గుదలే!
కాగా సేవలు, తయారీ రెండు రంగాలూ కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా నవంబర్‌తో పోల్చితే డిసెంబర్‌లో 56.3 నుంచి 54.9కి పడిపోయింది. ‘‘అయితే 2021లో ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశావహ అంచనాలను కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అయితే 2021 తొలి కాలంలో సవాళ్లు కొనసాగుతాయి. అయితే అటు తర్వాత సుస్థిర రికవరీ కొనసాగుతుంది. కోవిడ్‌–19 లభ్యత ఒకసారి ప్రారంభమైన తర్వాత మరింతగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని పోలీనా డీ లిమా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement