క్విక్‌ కామర్స్‌కి .. కిక్‌! | India quick commerce market projected surge to 90 billion dollars by FY 2031 | Sakshi
Sakshi News home page

క్విక్‌ కామర్స్‌కి .. కిక్‌!

Oct 8 2026 6:23 AM | Updated on Oct 8 2026 6:23 AM

India quick commerce market projected surge to 90 billion dollars by FY 2031

2030–31 నాటికి 90 బిలియన్‌ డాలర్లకు చేరిక 

మొత్తం రిటైల్‌ మార్కెట్లో 5 శాతం వాటా 

గూగుల్, రెడ్‌సీర్‌ నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌లో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ జోరుగా దూసుకెళ్తోంది. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 5–7 రెట్లు వృద్ధి చెంది ఏకంగా 70–90 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. తద్వారా దేశీయంగా మొత్తం రిటైల్‌ మార్కెట్లో దాదాపు 5 శాతం వాటా దక్కించుకోనుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ సుమారు 13 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఏటా 41–48 శాతం వృద్ధి చెందనుంది. 

గూగుల్, రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రతి నెలా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగించే యూజర్ల (ఎంటీయూ) సంఖ్య 10 కోట్లకు చేరనుంది. 2024 ఆర్తిక సంవత్సరంలో ఇది 1.2 కోట్లుగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 4–4.4 కోట్లుగా నమోదైంది. 

అదనంగా నమోదయ్యే స్థూల మర్చండైజ్‌ విలువ (జీఎంవీ) లో 60 శాతం వాటా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ తదితర ఎనిమిది మెట్రోపాలిటన్‌ నగరాలదే ఉండనుంది. ఇది సుమారు 45–60 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. మిగతా 40 శాతం వాటా (28–33 బిలియన్‌ డాలర్లు) మెట్రోయేతర ప్రాంతాల నుంచి ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో నెలవారీ యూజర్ల సంఖ్య నాలుగు–ఐదు రెట్లు వృద్ధి చెంది 1.2 – 1.6 కోట్ల నుంచి 5.5 – 6 కోట్లకు చేరనుంది. 16 మెట్రో, నాన్‌–మెట్రో నగరాలవ్యాప్తంగా 1,200 మంది ఈ అధ్యయనానికి సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు.  

రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. 
→ క్విక్‌ కామర్స్‌ ఇప్పటికే దేశీయంగా హైపర్‌లోకల్‌ ఎకానమీకి ఊతంగా ఉంటోంది. 29–30 బిలియన్‌ డాలర్ల హైపర్‌లోకల్‌ మార్కెట్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, రైడ్‌ హెయిలింగ్‌ (ట్యాక్సీ, బైక్‌ సర్వీసులు)కి మించి 40 శాతం వాటా దక్కించుకుంది. 

→ మెట్రో నగరాల్లో భవిష్యత్‌ విస్తరణ అనేది ప్రతి నెలా ప్రణాళికాబద్ధంగా కొనుక్కునే నిత్యావసర సరుకుల విభాగంలోకి చొరబడటంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ రకంగా కొనుక్కునే వాటి విలువ సుమారు రూ. 3,000 – రూ. 4,000 మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం ఈ కొనుగోళ్లలో అధిక భాగం .. సూపర్‌మార్కెట్లలో జరుగుతోంది. సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ), ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, శిశు సంరక్షణ ఉత్పత్తులు తదితర కేటగిరీల్లోకి కూడా క్విక్‌ కామర్స్‌ మరింతగా విస్తరించాల్సి ఉంటుంది.  

→ మరింత మెరుగైన ధరలు, బల్క్‌ ప్యాకింగ్‌ లభ్యత, తాజాదనంలాంటి అంశాల్లో వినియోగ దారులకు ఎదురవుతున్న పరిష్కరించగలిగితే 2031 ఆర్థిక సంవత్సరం నాటికి మెట్రో నగరాల్లో క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిత్యావసరాలపై చేసే ఖర్చులు 20–30 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చు. మెట్రోయేతర ప్రాంతాల్లో 99 శాతం నిత్యావసరాల కొనుగోళ్లు ఆఫ్‌లైన్‌లో దుకాణాల ద్వారానే జరుగుతున్నాయి. తాజా నాణ్యత, ప్లాట్‌ఫాంపై పెద్దగా నమ్మకం లేకపోవడం, ఆర్డరు విలువ చాలా తక్కువగా ఉండటంలాంటి అంశాల వల్ల క్విక్‌ కామర్స్‌ సవాళ్లు ఎదుర్కొంటోంది. చౌకగా డెలివరీ చేయడం, క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్లు అందించడం, ప్రాంతీయ భాషల్లో కస్టమర్‌ సపోర్ట్, స్థానిక కమ్యూనిటీ స్టోర్స్‌తో చేతులు కలపడంలాంటి అంశాల ద్వారా సంస్థలు ఈ అవరోధాలను అధిగమించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement