పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌

India Oil Demand To Increase By 7. 7percent In 2022 says OPEC - Sakshi

న్యూఢిల్లీ: ఈ క్యాలండర్‌ ఏడాది(2022)లో దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్‌ కనిపించనున్నట్లు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల(ఒపెక్‌) నెలవారీ నివేదిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌ తదితరాల డిమాండులో 7.73 శాతం వృద్ధి కనిపించనున్నట్లు అంచనా వేసింది. వెరసి 2021లో నమోదైన రోజుకి 4.77 మిలియన్‌ బ్యారళ్ల(బీపీడీ) నుంచి 5.14 మిలియన్‌ బ్యారళ్ల(బీపీడీ)కు డిమాండు పుంజుకోనున్నట్లు తెలియజేసింది.

ఇది అంతర్జాతీయంగా రికార్డ్‌కాగా.. చైనా డిమాండుతో పోలిస్తే 1.23 శాతం, యూఎస్‌కంటే 3.39 శాతం, యూరప్‌కంటే 4.62 శాతం అధికమని నివేదిక తెలియజేసింది. అయితే 2023లో దేశీ డిమాండు 4.67 శాతం వృద్ధితో 5.38 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.86 శాతంతో పోలిస్తే తక్కువకావడం గమనార్హం! ప్రపంచంలోనే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకోవడంతోపాటు..  వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తదుపరి ఇండియా మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్థిక వృద్ధి అండ
పటిష్ట వృద్ధి(7.1 శాతం)ని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టుల డిమాండుకు దన్నునివ్వనున్నట్లు ఒపెక్‌ నివేదిక పేర్కొంది. కా గా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జులై–సెప్టెంబర్‌)లో రుతుపవనాల కారణంగా చమురుకు డిమాండ్‌ మందగించే వీలున్నదని, అయినప్పటికీ తదుపరి పండుగల సీజన్‌తో ఊపందుకోనున్నట్లు వివరించింది. ఇటీవల పరిస్థితులు (ట్రెండ్‌) ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం డిమాండులో డీజిల్, జెట్‌ కిరోసిన్‌ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. కోవిడ్‌–19 ప్రభావంతో వీటికి గత కొంతకాలంగా డిమాండు క్షీణించిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top