
విదేశీ దిగ్గజ బ్రాండ్స్‌కు మన కాఫీయే కావాలి
స్పెషాలిటీ కాఫీగా అంతర్జాతీయంగా డిమాండ్
ప్రీమియం ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు
ప్రోత్సహిస్తే ఉత్పత్తిలో అద్భుతాలు ఖాయం
సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్రప్రసాద్
‘కొండ ప్రాంతాల్లో పంట. బాగా మగ్గిన కాఫీ చెర్రీస్ సేకరణ, గ్రేడింగ్ సైతం చేతితోనే.. భారత్ మినహా ప్రపంచంలో మరెక్కడా ఈ ప్రత్యేకత లేదు. అంతేకాదు నాణ్యతలోనూ మనది విశిష్ట స్థానమే. అందుకే ఖరీదైన ‘స్పెషాలిటీ కాఫీ’లభించే దేశాల జాబితాలో భారత్ నిలిచింది. కొన్ని ఎస్టేట్స్‌లో పండిన కాఫీ 100 శాతం ప్రీమియంతో అమ్ముడైన సందర్భాలు ఎన్నో. యూరప్‌కు చెందిన దిగ్గజ బ్రాండ్స్‌కు మన కాఫీయే కావాలని చెబుతారు. ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచిన భారత్‌లో 2023–24లో 3,74,200 టన్నుల కాఫీ పండింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు భారతీయ అరోమాను ప్రతిరోజూ ఆస్వాదిస్తున్నారు. నాణ్యత, పోటీ ధర, సర్వీస్‌తో భారత కాఫీ అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం మరింత పెరిగితే కాఫీ రంగంలో మన దేశం అద్భుతాలు సృష్టిస్తుంది’అంటారు ప్రైవేట్ లేబుల్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్. ఆయనింకా ఏమన్నారంటే.. -సాక్షి, స్పెషల్ డెస్క్
వినియోగం పెరిగింది
గతంలో భారత్‌లో కాఫీ వినియోగం ఏటా 50 టన్నులు మాత్రమే. నేడు 1,25,000 టన్నుల స్థాయికి చేరుకున్నాం. ఉత్పత్తి అధికం అయితే కాఫీ వినియోగం పెరుగుతుంది. దేశీయంగా 10,00,000 టన్నుల కాఫీ విక్రయించేంతగా అవకాశాలు ఉన్నాయి. 1960–70 ప్రాంతంలో ఇన్‌స్టంట్ కాఫీ తయారీ సామర్థ్యం కేవలం 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 70,000 టన్నులతో ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచాం. ఇందులో సీసీఎల్ వాటా 40,000 టన్నులు. అన్ని కంపెనీలకూ రెండింతలు ఉత్పత్తి చేయగల అదనపు సామర్థ్యం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని కాఫీకి విలువ జోడించడం ద్వారా ప్రపంచ పటంలో భారత్ నిలిచింది. ఇన్‌స్టంట్ కాఫీలో బ్రెజిల్ 90,000 టన్నులు, యూరప్ దేశాలు 80,000 టన్నులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఒక్క అరకులోనే..: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, పన్నులు లేవు.. అందుకే కాఫీ ఉత్పత్తిలో వియత్నాం 20–25 ఏళ్లలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మనదేశంలోనూ కాఫీ పంటకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో 5,000 టన్నులు పండుతోంది. దీనిని 1,00,000 టన్నుల స్థాయికి చేర్చవచ్చు. కావాల్సిందల్లా ప్రభుత్వ ప్రోత్సాహమే. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అనుబంధ కంపెనీలూ వస్తాయి. 5–10 ఏళ్లు కష్టపడితే చాలు.
కాఫీ స్టార్టప్స్..: యువ వ్యాపారవేత్తలు త్వరితగతిన డబ్బులు అందుకోవాలని చూస్తున్నారు. ఇదే సమస్యకు కారణం. సుస్థిరత, దీర్ఘకాల కోసం వ్యాపార సంస్థలు ప్రణాళిక చేసుకోవాలి. ఏ స్టార్టప్ అయినా, ఉత్పాదన ఏదైనా.. వినూత్నంగా ఉంటేనే నిలదొక్కుకుంటాయి. కాఫీ రంగంలోనూ ఎన్నో స్టార్టప్స్ వచ్చాయి. నాణ్యతలో స్థిరత్వం లేదు. ఆహార సంబంధ వ్యాపారంలో అపార అవకాశాలు ఉన్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగింది. వినియోగదార్లు ఆహారాన్ని ఆస్వాదించడంలో ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు.
అప్పు తీర్చే వరకు విస్తరణ వద్దు..
ఏ కంపెనీ అయినా అప్పు తీర్చేవరకు విస్తరణ చేపట్టకపోవడమే మంచింది. అప్పు తీసుకుని మొహం చాటేయడం మంచి పద్ధతి కాదు. వ్యాపారవేత్తలు తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే. లాభంలో 50 శాతం ఆదా చేయాల్సిందే. ఈజీ మనీ అనే ఆలోచనే రాకూడదు. నా చిన్ననాటితో పోలిస్తే నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయాయి. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం తగ్గింది. తల్లిదండ్రులు అంటే దేవుడి తరువాతి స్థానం. అలాంటిది ఇప్పుడు యాంత్రికంగా జీవిస్తున్నారు. కల్చర్ సైతం మారిపోయింది. డబ్బుకు ఒక దశ తరువాత విలువ ఉండదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి. డబ్బు విషయంలో దురాశ సమస్యలను తెచి్చపెడుతుంది.
ప్రభుత్వ జోక్యం ఉండరాదు..
కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది. లైసెన్స్ రాజ్ ఉండకూడదు. నిబంధనలు పెట్టడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి. కంపెనీలు తప్పు చేశాక ప్రభుత్వం రావడం కాదు.. తప్పు చేయక ముందే ప్రభుత్వం మేల్కొనాలి. దేశంలోని కోర్టుల్లో 75 శాతం ప్రభుత్వ వ్యాజ్యాలే.
100కు పైగా దేశాల్లో...
ప్రారంభించిన కొన్నాళ్లకే నష్టాలు ఎదురైనా.. కంపెనీని తిరిగి గాడిలో పెట్టి కాఫీ ప్రపంచంలో తెలుగువారి సత్తా చాటుతున్న తొలితరం వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం రూ.కోట్లు వెచి్చస్తున్న పెద్ద చేయి ఆయనది. ఉస్మానియా వర్సిటీ నుంచి 1975లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్యాకేజింగ్ మెటీరియల్, ట్యూబ్స్, డక్ట్స్, ఐటీ, రియల్టీ, నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. 1989 నుంచి కాఫీ వ్యాపారంలో ఉన్నారు. ఔత్సాహిక యువతను భుజం తట్టి వ్యాపారం వైపు ప్రోత్సహిస్తున్నారు. భారత కాఫీ బోర్డు సభ్యుడిగా నాలుగుసార్లు, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఒకసారి పనిచేశారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టంట్ కాఫీ మాన్యుఫ్యాక్చరర్స్ నుంచి 2019లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,160 కోట్లకుపైనే.100కిపైగా దేశాల్లోని విభిన్న బ్రాండ్స్‌కు కాఫీ సరఫరా చేస్తోంది. సొంత బ్రాండ్ అయిన ‘కాంటినెంటల్ కాఫీ’కి మంచి డిమాండ్ ఉంది.