
ఏడాదిలో 13,151 పర్మిట్లు
విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు
మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులే టాప్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీలు విదేశీ రహదారులపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లేవారు పాస్‌పోర్టులు, వీసాలతో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను కూడా ఒక తప్పనిసరి అవసరంగా భావించడం విశేషం. రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)కి ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ ఐడీపిపైన అక్కడ వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. సాధారణంగా యూఎస్‌కు వెళ్లేవారి నుంచి ఐడీపీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత డాలర్ కలలు కరిగిపోవడంతో విద్యార్థులు ఎక్కువగా యూరోప్ బాట పడుతున్నారు. దీంతో ఇప్పుడు యూఎస్‌కు వెళ్లే వాళ్లు మాత్రమే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇంటర్నేషనల్ పరి్మట్‌ల కోసం బారులు తీరుతున్నారు. ఏటా సగటున 10 వేల నుంచి 12 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌లను అందజేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,151 పరి్మట్‌లను అందజేశారు.
ఈజీగా డ్రైవింగ్..
లక్షలకొద్దీ వాహనాలు, కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ రద్దీ నడుమ హైదరాబాద్‌లో బండి నడిపిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా దూసుకుపోగలుగుతాడనేది జగమెరిగిన సత్యం. అందుకే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు అక్కడి రోడ్లపైన తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సొంత డ్రైవింగ్ తప్పదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ పరి్మట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు మహిళలు సైతం ఐడీపీల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరిగా మారడంతో డ్రైవింగ్ కూడా అనివార్యమైంది. మరోవైపు మన ఐడీపీలు ఉన్న వాళ్లకు ఆయా దేశాల్లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం కూడా తేలిక. పెద్దగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే లైసెన్సులు అందజేస్తారు.
ఐడీపీలు పొందడం ఇలా....
పాస్‌పోర్టు కలిగిన వారు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లను తీసుకోవచ్చు.ఇందుకోసం రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సారథి’ వెబ్‌సైట్‌లో స్లాట్ నమోదు చేసుకోవాలి. అలాగే రూ.1500 ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అనంతరం పాస్‌పోర్టు,ఆధార్. డ్రైవింగ్ లైసెన్సు, తదితర డాక్యుమెంట్‌లతో సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలోని అధికారులను సంప్రదిస్తే అప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్‌పరి్మట్‌లను అందజేస్తారు. ఇది తీసుకున్న రోజు నుంచి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.ఆ తరువాత దీన్ని పొడిగించుకొనేందుకు అవకాశం లేదు. మరోసారి స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాల్లోనే స్థిరపడేవారైతే ఏడాదిలోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది.నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, తదితర ప్రాంతీయ రవాణాకార్యాలయాల నుంచి సగటున 120 నుంచి 150 పర్మిట్ ను అందజేస్తున్నట్లు అంచనా.
కొన్ని దేశాల్లో మన ఐడీపీ చెల్లుబాటు కాదు
మన అంతర్జాతీయ డ్రైవింగ్ పరి్మట్లకు సుమారు 150 దేశాల్లో ఆమోదం ఉంది.కానీ కొన్ని దేశాల్లో మాత్రం చెల్లుబాటు కాదు.జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో భారతీయ ఐడీపీలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అక్కడ రవాణాశాఖ నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. యూఎస్,బ్రిటన్,న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, తదితర దేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం 6 నుంచి 9 నెలల వరకు అనుమతినిస్తారు.డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు దృష్ట్యానే ఈ అనుమతుల్లో తేడాలు ఉన్నట్లు రహదారిభద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.