
చైనాను మించి వేగంగా వృద్ధి
ఈ ఏడాది 3.4% పెరిగే అవకాశం ఒపెక్ అంచనా
న్యూఢిల్లీ: ప్రధాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధనానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025, 2026లో చైనాకు రెండింతల వేగంతో వృద్ధి చెందనుంది. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా 2024లో రోజుకు 5.55 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉన్న డిమాండ్ 2025లో 3.39 శాతం వృద్ధితో 5.74 ఎంబీపీడీకి చేరనుంది. అలాగే 206లో 4.28 శాతం పెరిగి 5.99 ఎంబీపీడీకి ఎగియనుంది.
అదే సమయంలో చైనాలో ఆయిల్‌కు డిమాండ్ ఈ ఏడాది, వచ్చే ఏడాది వరుసగా 1.5 శాతం, 1.25 శాతం మేర పెరగనుంది. వినియోగదారులు ఖర్చు పెడుతుండటం, పెట్టుబడుల ప్రవాహం, కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు తదితర అంశాలతో భారత్ పటిష్టమైన ఆర్థిక వృద్ధిని సాధించే ధోరణి కొనసాగుతుందని ఒపెక్ పేర్కొంది. అమెరికా ఇటీవల ప్రకటించిన టారిఫ్‌లతో భారత జీడీపీపై ప్రభావం చూపినప్పటికీ, ద్రవ్య..ఆర్థిక విధానాలపరమైన ఉద్దీపన చర్యలతో దాన్ని కొంత మేర అధిగమించవచ్చని వివరించింది.
సమీప భవిష్యత్తులో భారత్‌లో ఆయిల్‌కి డిమాండ్ స్థిరంగా ఉంటుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనికి డీజిల్ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఒపెక్ వివరించింది. భారత్ సింహభాగం క్రూడాయిల్ కోసం (85 శాతం) దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. మార్చి డేటా ప్రకారం రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరిలో నమోదైన 31 శాతంతో పోలిస్తే అత్యధిక స్థాయి 36 శాతానికి పెరిగాయి. 17 శాతం వాటాతో ఇరాక్ రెండో స్థానంలో, 11 శాతంతో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి.
మరిన్ని విశేషాలు..
→ రహదారుల విస్తరణ భారీ స్థాయిలో జరుగుతున్నందున తారుకు కూడా డిమాండ్ పెరుగుతోంది. రవాణా ఇంధనాలు, తయారీ రంగం పుంజుకుంటుందనే బలమైన అంచనాలు, పెట్రోకెమికల్ రంగం ఫీడ్‌స్టాక్ అవసరాలు పెరగడం వంటి అంశాలు ఆయిల్ డిమాండ్‌కి కారణంగా నిలవనున్నాయి.
→ 2026లో వాణిజ్య సంబంధ చర్చల దన్నుతో టారిఫ్‌లు గణనీయంగా తగ్గొచ్చు. దీనితో వాటి ప్రతికూల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉండొచ్చు.
→ తయారీ, సేవల రంగాలు పటిష్టంగా ఉండటం, కీలక రంగాలకు ప్రస్తుత ప్రభుత్వం మద్దతునిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం లాంటి అంశాల వల్ల భారత ఎకానమీ వృద్ధి బాటలో ముందుకెళ్లనుంది.
→ అంతర్జాతీయంగా చమురు డిమాండ్ కాస్త నెమ్మదించినా వరుసగా రెండేళ్లలో 1.3 ఎంబీపీడీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.
→ చమురుకు డిమాండ్‌లో అమెరికా అగ్రస్థానంలోనే కొనసాగనుంది. 2025లో 20.5 ఎంబీపీడీతో అమెరికా మొదటి స్థానంలో, 16.90 ఎంబీపీడీతో చైనా రెండో స్థానంలో ఉండనుంది. భారత్ మూడో స్థానంలో ఉంటుంది.