
ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 600 కిలోల కొనుగోలు
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. దీంతో సెప్టెంబర్ చివరికి ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. వీటి విలువ 95 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.36 లక్షల కోట్లు)గా ఉంటుందని ఆర్‌బీఐ డేటా తెలియజేస్తోంది.
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 200 కిలోలు, జూలై–సెప్టెంబర్ కాలంలో మరో 400 కిలోల చొప్పున బంగారం నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంది. అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్ ను తగ్గించుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతోంది. 2025 మార్చి చివరికి ఆర్‌బీఐ వద్ద 879.58 మెట్రికల్ టన్నుల పసిడి నిల్వలు ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆర్‌బీఐ 54.13 మెట్రిక్ టన్నుల మేర బంగారం కొనుగోలు చేసింది. ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పసిడికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ డేటా స్పష్టం చేస్తోంది.