
నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడం, శ్రామిక శక్తిని పెంచడంపై దృష్టి సారించేలా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే బడ్జెట్‌లో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. అమెరికా హెచ్1బీ వీసా ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కెనడా చర్యలు కీలకంగా మారనున్నాయి.
ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ.. ‘దేశ అవసరాలకు సరిపోలేలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా బడ్జెట్‌లో కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికకు కేటాయింపులుంటాయి. ఈ ప్రణాళికలో ప్రతిభ, నైపుణ్యాల శిక్షణ, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన అప్రెంటిస్‌షిప్‌లు ఉంటాయి’ అని చెప్పారు.
అమెరికన్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో కార్నీ గ్లోబల్ టెక్ టాలెంట్‌పై దృష్టి సారించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఛార్జీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధిస్తామని చెప్పారు. ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ వంటి రంగాలలో విదేశీ ప్రతిభపై ఆధారపడే యూఎస్ కంపెనీల్లో అనిశ్చితిని సృష్టించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కెనడా తమ దేశంలోకి ప్రతిభను ఆకర్షించే విధానాలు రూపొందిస్తుంది.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు