
మొదట సుంకాల మోత... ఆ తర్వాత కొత్త హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు వ్యవహారం.. ఆపైన బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలితో భారత్-అమెరికా సంబంధాల్లో తెలియని గందరగోళం నెలకొంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మొన్న అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావమూ మన వీసాలపై పడనుంది.
ఇప్పుడేం జరిగింది?
హెచ్1బీ వీసాల ఫీజును ఒకేసారి దాదాపు 60 రెట్లు పెంచుతూ, లక్ష డాలర్లు చేస్తున్నట్టు సెప్టెంబర్ 19న ట్రంప్ సంతకం చేశారు. గందరగోళం రేగడంతో, కొత్త దరఖాస్తులకే ఈ హెచ్చు ఫీజు వర్తిస్తుందనీ, ఇప్పటికే వీసా ఉన్నవారికీ, రెన్యువల్ కోరుతున్న వారికీ అది వర్తించదనీ వాషింగ్టన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో అక్టోబర్ 1 నాటి షట్‌డౌన్ నిర్ణయంతో మరో చిక్కు వచ్చి పడింది.
షట్‌డౌన్ కథేమిటి?
ఏటా అక్టోబర్ 1 నుంచి మరుసటి సెప్టెంబర్ 30 వరకు అమెరికా ప్రభుత్వపు ఆర్థిక సంవత్సరం. ఆ కాలవ్యవధికి అన్ని శాఖల వ్యయపరిమితిని నిర్ణ యిస్తూ మన బడ్జెట్ తరహాలో నిధుల కేటాయింపు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా, దేశాధ్యక్షుడు సంతకం చేయాలి. ఈ ఫండింగ్ బిల్ సమయానికి ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే, అత్యవసరం కాని సర్వీసులు స్తంభిస్తాయి. దీనితో కొత్త దరఖాస్తులు, బదిలీలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియలు ఆగిపోయాయి.
ఎంత కష్టం? ఎవరికి నష్టం?
నిజానికి, అమెరికన్ పౌరులు కానివారు ఆ దేశంలో ప్రత్యేక ఉద్యోగాలు సంపాదించడానికి హెచ్1బీ వీసాలు ఒక మార్గం. ఏటా గరిష్ఠంగా 65 వేల వీసాలే ఇవ్వాలి. అమెరికాకు చెందిన ఉన్నత విద్యాసంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, లేదా డాక్టరేట్ చేసిన విదేశీ వృత్తి నిపుణులకై అదనంగా మరో 20 వేల వీసాలు ఇవ్వవచ్చు. నిరుడు 80 వేల మందికి పైగా భారతీయులు హెచ్1బీలకు దరఖాస్తులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన మొత్తం హెచ్1బీలలో 71 శాతం మన భారతీయులవే. పెంచిన తాజా వీసా ఫీజు ఆ దేశంలో భారీ టెక్ సంస్థలకే నష్టం. అవన్నీ విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయి.
తెరుచుకున్న కొత్త తలుపులు
ఇప్పుడు ట్రంప్ ఫీజు పెంపుతో భారతీయ వృత్తి నిపుణుల్లో లక్ష మందిపై ప్రభావం పడుతుందని అంచనా. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లోని వారు ఎక్కువ నష్టపోతారు. ఈ పరిస్థితుల్లో చైనా, జర్మనీల నుంచి బ్రిటన్ దాకా వివిధ దేశాలు భారత్‌లోని ప్రతిభావంతుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక వీసా విధానాల్ని అందిస్తామంటున్నాయి. చైనా ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కొత్త ‘కె’ వీసాను అమలులోకి తెచ్చింది. స్పాన్సర్ అవసరం లేకపోవడం ‘కె’ వీసా ఆకర్షణ.
మరోపక్క విదేశీ ఉద్యోగులను తీసుకొనేందుకు త్వరలోనే కొన్ని ప్రతిపాదనల్ని చేయనున్నట్టు కెనడా ప్రధాని ఇటీవలే ప్రకటించారు. అమెరికాకు ప్రత్యామ్నాయం తమ ఆర్థిక వ్యవస్థే అంటూ, ఐటీ, సైన్స్, టెక్ రంగాలలో భారతీయులకు పుష్కలంగా అవకా శాలున్నాయని జర్మనీ చెబుతోంది. పైగా, జర్మనీలో పెరుగుతున్న వయోవృద్ధుల రీత్యా కనీసం 2040 వరకు ఏటా దాదాపు 2.88 లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. ఇవన్నీ అమెరికన్ వీసాల సంక్షోభ వేళ భారతీయులకు అందివచ్చిన సరికొత్త అవకాశాలు.
రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది?
వీసా ఫీజుపై ఇవే నిబంధనలు కొనసాగితే, అమెరికన్ ఐటీ సంస్థలు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు పెట్టి కొత్త ఉద్యోగుల్ని తీసుకువెళ్ళడం కష్టమే. కాకపోతే, మరో మార్గం ఉంది. భారతీయుల ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవి ఇక్కడే ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ (జీసీసీలు) నెలకొల్పవచ్చు. ఇప్పటికే మన దేశంలో 1,600 జీసీసీలు పెట్టాయి. మరిన్ని జీసీసీ లొస్తే, వీసా షరతుల ప్రభావం ఉండదు. ఈ 2025 నాటికి భారత్‌లోని జీసీసీలు 20 లక్షల మందికి పైగా నిపుణులకు ఉపాధినిస్తున్నాయి. ఏమైనా, సాక్షాత్తూ అమెరికాయే వలస జీవులతో నిర్మితమైన దేశం. ఆ సంగతి ట్రంప్ మర్చిపోతేనే కష్టం.