అవసరం లేని దిగుమతులకు కళ్లెం వేయాలి
దేశీ పరిశ్రమలకు అండగా నిలవాలి
సంక్షోభాన్ని అధిగమించేందుకు పరిష్కారాలు
థింక్ చేంజ్ ఫోరమ్ నివేదిక
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల పోటీతత్వం పెంచేందుకు పన్నుల తగ్గింపు, అవసరం లేని, అనర్ధదాయక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు.. తగిన రక్షణ చర్యలు అవసరమని ఒక నివేదిక సూచించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది.
దీనివల్ల ఇంధనం, వ్యవసాయం, ఉత్పాదక రంగాలలో వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి సబ్సిడీలపై ఆధారపడటం పరిష్కారం కాదని సూచించింది.
సబ్సిడీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సమర్థతను కోల్పోతాయంటూ.. వీటికి బదులు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడానికి పన్నుల నిర్మాణంలో మార్పులు చేయాలని, దేశీయ పరిశ్రమలకు మేలు జరిగేలా దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సవరించాలని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసరమైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవాలని సూచించింది.
అవసరం లేని వస్తు దిగుమతులను తగ్గించడం అన్నది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, అది దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైందన్న ప్రధాని మోదీ ఇటీవలి పిలుపును ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు పెరగ్గా.. ఎగుమతులు 441.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం తెలిసిందే. దీనివల్ల దేశ వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లు దాటిపోయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటాను ఉదహరించింది.
రూపాయిని కాపాడుకోవాలి..
→ అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన కరెన్సీ (రూపాయి) విలువను కాపాడుకునేందుకు తక్కువ విలువ జోడించే విడిభాగాలను కట్టడి చేయాలి. వీటి తయారీకి సంబంధించి దేశీయంగా తగిన తయారీ వ్యవస్థ ఉంది.
→ హానికారక వస్తు దిగుమతులను సైతం నిషేధించాలి. తక్కువ విలువతో కూడిన విచక్షణారహిత దిగుమతులను అనుమతించడం వల్ల విదేశీ మారకం నిల్వలపై ఒత్తిళ్లు పడుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా బలమైన విలువ జోడింపు అవకాశాలు, సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది.
→ పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ.. 116 మిలియన్ డాలర్ల విలువైన సిగరెట్లు, సిగార్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకుంటోంది.
→ ఖరీదైన కన్ఫెక్షనరీలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, విలాసవంతమైన వాచీలు, కార్ల దిగుమతులను సాధారణ అనుమతుల జాబితా నుంచి తొలగించి, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి.
→ విదేశీ వస్తు దిగుమతులతో దేశీ పరిశ్రమలు నష్టపోతున్నప్పుడు, వాటిని రక్షించడానికి తగిన వాణిజ్య చర్యలను తగిన కాలపరిమితితో తక్షణమే అమలు చేయాలి.


