తయారీ రంగం.. 8 నెలల గరిష్టం | India manufacturing sector significant growth in March 2025 | Sakshi
Sakshi News home page

తయారీ రంగం.. 8 నెలల గరిష్టం

Apr 3 2025 8:52 AM | Updated on Apr 3 2025 8:52 AM

India manufacturing sector significant growth in March 2025

తయారీ రంగం మార్చిలో బలంగా పుంజుకుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా.. తిరిగి మార్చిలో ఎనిమిది నెలల గరిష్టానికి పెరిగింది. ఫిబ్రవరిలో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్‌ మనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 56.3గా ఉంటే, మార్చి నెలలో 58.1కు చేరుకుంది. కొత్త ఆర్డర్లు ఈ స్థాయి రికవరీకి తోడ్పడినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తెలిపింది.

పీఎంఐ సాధారణంగా 50కి పైన నమోదు అయితే తయారీ విస్తరణగాను, ఆలోపు వస్తే క్షీణతగాను పరిగణిస్తుంటారు. ‘మార్చిలో అమ్మకాలు 2024 జులై తర్వాత గణనీయంగా నమోదయ్యాయి. సానుకూల డిమాండ్‌ పరిస్థితులు, కస్టమర్ల ఆసక్తి, విజయవంతమైన మార్కెటింగ్‌ చర్యలు దోహదపడ్డాయి’ అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వే తెలిపింది. ముఖ్యంగా 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో కంపెనీలు తయారీని గణనీయంగా పెంచినట్టు పేర్కొంది. చారిత్రక సగటు కంటే తయారీ అధికంగా నమోదైనట్టు వివరించింది.

ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్‌ రూమ్‌..

‘అంతర్జాతీయ ఆర్డర్లు కాస్తంత నిదానించాయి. అయినప్పటికీ డిమాండ్‌ బలంగా ఉంది. కొత్త ఆర్డర్ల సూచీ ఎనిమిది నెలల గరిష్టం అయిన 61.5కు చేరుకుంది’ అని హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజల్‌ భండారీ పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్‌ను అందుకునేందుకు కంపెనీలు తమ నిల్వలను వినియోగించుకున్నాయని.. దీంతో ఫినిష్డ్‌ గూడ్స్‌ నిల్వలు 2022 జనవరి తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని సర్వే నివేదిక వివరించింది. సుమారు 400 తయారీ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలను ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement