చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది! | Sakshi Guest Column On India agricultural sector in crisis | Sakshi
Sakshi News home page

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

Jun 1 2026 1:05 AM | Updated on Jun 1 2026 1:05 AM

Sakshi Guest Column On India agricultural sector in crisis

విశ్లేషణ

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లో వ్యవసాయం స్పష్టంగా రాష్ట్ర జాబితాలో ఉంది. జాబితా–2 లోని 14వ నమోదు (ఎంట్రీ) ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన, పంట రక్షణ.. ఇవన్నీ రాష్ట్రాల ప్రత్యేక అధికారం. 18వ నమోదులో భూమి, కౌలు, బదిలీ, వ్యవసాయ రుణాలు ఉన్నాయి. 28వ నమోదులో మార్కెట్లు, సంతలు ఉన్నాయి. వ్యవసాయం స్థానికమైనది. నేలలు, వర్షాలు, పంటల చక్రాలు, కౌలు విధానాలు, విత్తన సంస్కృతులు రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా మారతాయి అని రాజ్యాంగ నిర్మాతలకూ తెలుసు.

కేంద్రీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ శాస్త్రపరంగా అసంబద్ధం. అందుకే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఎనిమిది దశాబ్దాలు గడిచిన తరువాత కూడా వరి కనీస మద్దతు ధర, పప్పుధాన్యాల దిగుమతి సుంకం, పురుగుమందుల రిజిస్ట్రేషన్, జీఎం పంటల అనుమతి, ఎరువుల సబ్సిడీ నిర్మాణం, పంటల బీమా రూపకల్పన, రైతు డేటాబేస్‌ ఫార్మాట్, మట్టి, కార్బన్‌ క్రెడిట్‌ ప్రోటో కాల్‌లు, రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లను కేంద్ర ప్రాధాన్యతలకు పరిమితం చేసే కేంద్ర పథకాల షరతులు... వీటన్నింటినీ నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే! రాష్ట్రాలు కేవలం ఆ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోయాయి. కేంద్ర మార్గదర్శకాల ద్వారా, కేంద్ర గుర్తింపుతో పథకాలను అమలు చేస్తూ, కృషి భవన్, వాణిజ్య భవన్‌లలో తీసుకున్న నిర్ణయాల పర్యావరణ భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి.

ఇరవై ఏళ్లుగా మొలకెత్తని విత్తన బిల్లు!
వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచిన అసలు ఏర్పాటు నిశ్శబ్దంగా క్రమేణా శూన్యమైపోయింది. వాణిజ్య అధికారాలు, ఉమ్మడి జాబితా నమోదులు, నిత్యావసర వస్తువుల చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల కింద అంతర్జాతీయ నిబద్ధతలు, జీఎస్టీ ద్వారా ఆర్థిక కేంద్రీకరణ, షరతులతో కూడిన కేంద్ర పథకాల విస్త రణ... ఇవన్నీ కలిసి రాజ్యాంగ సవరణ లేకుండానే జరిగిపోయాయి.  క్షేత్రస్థాయి పరిశీలన ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. 2003–04లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి పంట నాశనమైంది. నాణ్యత లేని బి.టి. హైబ్రిడ్‌లపై కాయతొలుచు పురుగు దాడి, నకిలీ విత్తనాలు అమ్మిన అవినీతి డీలర్లు, వాతావరణ ఒత్తిడి... వీటన్నిటి కారణంగా అప్పుల్లో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విత్తన నాణ్యత పరీక్ష, కంపెనీల జవాబుదారీతనం, రైతుల పరిహారం కోసం విత్తన నష్ట పరిహార చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే ఆ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ విత్తన బిల్లు సిద్ధంగా ఉందనీ, రాష్ట్ర చట్టం గందరగోళం సృష్టిస్తుందనీ కేంద్ర అధికారులు వాదించారు. రాష్ట్రాన్ని ఆగమని కోరారు. 2004 విత్తన బిల్లు దాదాపు రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో మూలుగుతూ ఉంది. ఈ మధ్య లోని కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురైనా వాటికి ఎలాంటి చట్టపరమైన పరిష్కారమూ లభించ లేదు.

పురుగుమందుల విషయంలో మరింత దారుణమైన అసమ తుల్యత ఉంది. 1968 క్రిమిసంహారక చట్టం సెక్షన్‌ 27 ప్రకారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర పురుగుమందు అమ్మకాన్ని నిషేధించ గలిగేది గరిష్ఠంగా 90 రోజులు (మొదట 60 రోజులు, తర్వాత 30 రోజులు) మాత్రమే. అంటే తన ప్రజలను ప్రమాదకర రసాయనం నుండి కాపాడుకోవడానికి ఒక రాష్ట్రానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశం 90 రోజులు మాత్రమే. ఆసుపత్రి అడ్మిషన్లు, దీర్ఘకాలిక నాడీ వ్యాధులు, విషం తాగి ఆత్మహత్యలు వీటన్నిటినీ భరించే రాష్ట్రానికి స్వయంగా నిర్ణయం తీసుకునే వెలుసుబాటు లేదు. ఉదా: కేరళ 2001లో ఎండోసల్ఫా¯Œ ను నిషేధించింది. కేంద్రం దానిని జాతీయ స్థాయిలో నిషేధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది.  

నియంత్రణలకు రాష్ట్రాల సమ్మతి ఏదీ?
తెలంగాణలో వరి సాగును పరిశీలించండి. దాదాపు 40 లక్షల హెక్టార్లలో, ఎక్కువగా బోర్‌వెల్‌ నీటిపై ఆధారపడి, రాష్ట్రం ఇచ్చే ఉచిత విద్యుత్‌తో పంపింగ్‌ చేసే భూగర్భ జలంతో ఇది సాగుతోంది. వరి సాగుకు ప్రోత్సాహం ఇచ్చే కనీస మద్దతు ధరపై రాష్ట్రా నికి అధికారం లేదు. ఎరువుల సబ్సిడీపై అధికారమూ పరిమితమే. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా ‘సేకరణ’ విధానాన్ని మార్చలేదు. వాణిజ్యంలో రాజ్యాంగ వైరుధ్యం మరింత పదునుగా కని పిస్తుంది. వ్యవసాయం రాష్ట్ర అంశం. వ్యవసాయ వాణిజ్యం కేంద్ర అంశం. అంటే ఉల్లి సాగును మహారాష్ట్ర నియంత్రిస్తుంది. ఉల్లి ఎగుమతిని వాణిజ్య భవన్‌ నియంత్రిస్తుంది. 2007–08, 2010, 2019, మళ్లీ 2023లో దేశీయ ధరల ఒత్తిడికి స్పందనగా, ఎగుమతి మార్కెట్‌ను ఆశించి పంటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం బియ్యం, గోధుమపై హఠాత్తుగా ఎగుమతి నిషే ధాలను విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ‘ఏషియన్‌’ దేశాలు, జపాన్, కొరియాలతో ద్వైపాక్షిక ఒప్పందం.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా రాష్ట్రాల అధికారిక భాగస్వామ్యంతో చర్చ జరగలేదు.

మరి పరిష్కారం? మొదట, వ్యవసాయ సమాఖ్య కమిషన్‌ ఏర్పాటు చేయాలి. సర్కారియా (1988), పుంఛీ (2010) కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దృష్టి పెట్టినా, ప్రత్యేకించి వ్యవసాయంపై పెట్టలేదు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో, రాజ్యాంగ సవ రణలు, చట్టపరమైన మార్పులు, ఆర్థిక పునర్నిర్మాణం... వీటిని సిఫార్సు చేయగల అధికారంతో ఈ కమిషన్‌ ఉండాలి. రెండవది, నిర్దిష్ట చట్టపరమైన స్పష్టతలు కావాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణ, ఎగుమతి, నిల్వ నియంత్రణలు విధించే ముందు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. హానికర పురుగుమందులను శాశ్వతంగా నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.

గిట్టుబాటు కాని పంటలకు బోనస్‌
మూడవది, పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు ఆర్థిక వికేంద్రీకరణ. జీడీపీలో దాదాపు 1.7 శాతం ఉన్న ఎరువుల సబ్సి డీని (ప్రస్తుతం దాదాపు పూర్తిగా తయారీదారులకు చెల్లిస్తున్న దానిని) క్రమంగా ‘రైతువారీ పర్యావరణ పరివర్తన చెల్లింపు’గా మార్చాలి. స్థానిక ప్రాధాన్యతల ప్రకారం రాష్ట్రాలు దీనిని వినియో గించుకోవాలి. మార్కెట్‌ దొరకని పంటలకు సేకరణ, గిట్టుబాటు కాని పంటలకు బోనస్‌ ఇచ్చే పద్ధతి కావాలి. భూగర్భ జలాలను కాపాడే, మట్టి కార్బన్‌ను నిల్వ చేసే, సంప్రదాయ విత్తనాల్ని రక్షించే రాష్ట్రాలకు పర్యావరణ ఆర్థిక బదిలీలు అందించాలి.

నాల్గవది, ప్రాంతీయ ఆహార వ్యవస్థల ప్రణాళిక. భారత వ్యవ సాయ వైవిధ్యానికి ఒకే జాతీయ ఆహార విధానం కాదు, ప్రతి
ప్రాంత వ్యవసాయ పర్యావరణం, ఆహార సంస్కృతి, ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన ప్రాంతీయ ఆహార వ్యవస్థ ప్రణాళికల సమాఖ్య సరైనది. తూర్పు కనుమల చిరుధాన్య ప్రాంతం, ఇండో–గంగా మైదానం, పశ్చిమ కనుమల సుగంధ ద్రవ్య ప్రాంతం, ఈశాన్య పోడు వ్యవసాయ ప్రాంతం, పశ్చిమ భారత పప్పుల ప్రాంతం, దక్షిణ ద్వీపకల్ప నీటిపారుదల వరి బెల్ట్‌... ప్రతిదీ ఒక ప్రత్యేక వ్యవసాయ పర్యావరణ మండలం. ఏక రూప పంటల విధానం రుద్దడం కాకుండా, ప్రాంతీయ ఆహార వ్యవస్థల కలయికగా జాతీయ ఆహార భద్రతను నిర్మించవచ్చు.

డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,
‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement