చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? | Underground Revolution Underway in India Anand Mahindra Explains | Sakshi
Sakshi News home page

చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

May 18 2026 7:27 AM | Updated on May 18 2026 9:13 AM

Underground Revolution Underway in India Anand Mahindra Explains

భారతదేశం ఎదుగుదలకు తయారీ రంగం చాలా కీలకమని కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తయారీ రంగ వృద్ధి గురించి బిల్డింగ్ ఎనర్జీ సూపర్‌-ఇంటెలిజెన్స్ 'శుభమ్ మిశ్రా' ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.

భారతదేశలో తయారీ రంగ అభివృద్ధిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి పెద్ద కంపెనీల రూపంలో కాకుండా.. చిన్న భాగాల తయారీ సంస్థల్లో, సరఫరా వ్యవస్థల్లో జరుగుతోంది. ఉదాహరణకు.. 2014లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు దీని విలువ 115 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఇది భారత పరిశ్రమల వేగవంతమైన ఎదుగుదలకు నిదర్శనం అని శుభమ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఐఫోన్ తయారీలో భారత్
యాపిల్ కంపెనీ సరఫరా వ్యవస్థలో.. భారతదేశం కీలక పాత్ర పోషించడం కూడా ఒక పెద్ద మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ఐఫోన్ తయారీలో భారతదేశం పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో గణనీయమైన శాతం భారత్‌లోనే తయారవుతోంది. ఇది భారతీయ పరిశ్రమల నైపుణ్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.

మిశ్రా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు అభివృద్ధి చిన్న పరిశ్రమల పనితీరులో ఉంది. హోసూర్ వంటి ప్రాంతాల్లో చిన్న సంస్థలు అతి సూక్ష్మ ప్రమాణాలతో భాగాలను తయారు చేయడం నేర్చుకుంటున్నాయి. ఇలాంటి నైపుణ్యాలే ఒక దేశాన్ని పరిశ్రమల శక్తిగా మార్చుతాయి.

చైనాలా భారత్
భారతదేశాన్ని మిశ్రా ప్రారంభ దశలో ఉన్న చైనాతో పోల్చారు. చైనా ఒక్కసారిగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారలేదు. 2003 నుంచి 2018 మధ్య నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో కూడా ప్రపంచం ''వాళ్లు కేవలం అసెంబ్లీ పని చేస్తున్నారు'' అని భావించింది. కానీ అదే చిన్న చిన్న పురోగతులు తరువాత చైనాను ప్రపంచ తయారీ శక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి దశలో ఉందని ఆయన సూచించారు.

దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. దేశ ఆర్థికాభివృద్ధి పెరగాలంటే, కేవలం కొన్ని పెద్ద కంపెనీల వల్ల మాత్రమే సాధ్యం కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs), ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, సరఫరా సంస్థల కలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

నిజమైన అభివృద్ధి..
అనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. తయారీ రంగం బయటకు కనిపించేంత గొప్పగా ఉండదు. కానీ నిజమైన అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలలో, యంత్రాల మధ్య, పరిశ్రమల షెడ్లలో జరుగుతుంది. చిన్న పరిశ్రమలు తమ పనిలో నాణ్యతను పెంచుకుంటూ.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంటున్నాయి. ఇవే భవిష్యత్తులో భారతదేశాన్ని బలమైన దేశంగా నిలబెడతాయి.

దేశం ఎదగాలంటే..
దేశం ఎదగాలంటే.. ముఖ్యంగా MSMEsకు ప్రభుత్వ మద్దతు అవసరమని చెప్పారు. మంచి రహదారులు, ఇండస్ట్రియల్ పార్కులు, త్వరితగతిన అనుమతులు, తక్కువ నియంత్రణ సమస్యలు ఉంటే పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయి. పెద్ద కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం సరిపోదు. మధ్య తరహా సంస్థలకు సులభమైన వ్యాపార వాతావరణం కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement