భారత్‌ వృద్ధి.. పెట్టుబడి విధానాల్లో మార్పు! | India Growth Story Enters a New Phase of Capital Market Integration | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి.. పెట్టుబడి విధానాల్లో మార్పు!

May 18 2026 8:29 AM | Updated on May 18 2026 8:59 AM

India Growth Story Enters a New Phase of Capital Market Integration

ఆర్థిక సంస్కరణల అనంతరం దేశీయంగా చాలా కాలం పాటు ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్‌ మార్కెట్లు వృద్ధి చెందినప్పటికీ, అవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ముందుకు సాగలేదు. ఆర్థిక విస్తరణపై ప్రభుత్వ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్‌ రంగానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. క్యాపిటల్‌ మార్కెట్లు అప్పుడప్పుడు మాత్రమే తమ ఉనికిని చాటుకునేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది.

ఆర్థిక ప్రగతి, క్యాపిటల్‌ మార్కెట్లు వేర్వేరుగా కాకుండా ఒకదానికొకటి దన్నుగా ఉండే ఏకీకృత వ్యవస్థగా భారత్‌ ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ మార్పు తాత్కాలికమైనది కాదు..నిర్మాణాత్మకమైనది. భారత్‌ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలనుకునే మదుపర్లకు ఇది ఎంతో కీలకంగా ఉండనుంది.

పెట్టుబడి విధానాల్లో నిర్మాణాత్మక మార్పు
భారతీయులు పొదుపు చేయడంలో ముందుంటారు. అయితే, చారిత్రకంగా మన దేశంలోని గృహ పొదుపు మొత్తాలు ఎక్కువగా రియల్‌ ఎస్టేట్, బంగారం లేదా బ్యాంక్‌ డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులలోకే వెళ్లేవి. ఇవి వ్యక్తిగతంగా భద్రతను ఇచ్చినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు అందవలసిన దీర్ఘకాలిక మూలధన లభ్యత పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడది మారుతోంది.

గృహాల పొదుపు మొత్తాలు క్రమంగా ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్ల వంటి మార్కెట్‌ ఆధారిత సాధనాల వైపు మళ్లుతున్నాయి. మార్చి 2026 నాటికి, దేశీయంగా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం రూ. 79.5 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్‌ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఈ రంగం రెండంకెల వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది ఆషామాషీ మార్పు కాదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజల భాగస్వామ్యం, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు (సిప్‌)  మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి.

డిజిటలైజేషన్‌ దన్ను
డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దన్నుతోనే క్యాపిటల్‌ మార్కెట్లు అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమవుతోంది. 2026 మార్చి ఆఖరు నాటికి 144 కోట్లకు పైగా ఆధార్‌ ఐడీలు, 57.7 కోట్లకు పైగా జన్‌ ధన్‌ ఖాతాలు, 125 కోట్ల మంది మొబైల్‌ యూజర్లు, రోజువారీ రూ. 95,000 కోట్లకు పైగా విలువ చేసే లావాదేవీల పరిమాణంతో యూపీఐ వ్యవస్థలాంటివి భారత డిజిటల్‌ విప్లవానికి పునాది వేశాయి.

ఆధార్‌ ఆధారిత ఈకేవైసీ, యూపీఐ  చెల్లింపులు,  కాగితరహిత పద్ధతుల వల్ల పెట్టుబడి పెట్టడానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయాయి. సామాన్యుల భాగస్వామ్యం పెరగడమే కాకుండా, మధ్యవర్తులపరమైన ఖర్చులు తగ్గి మార్కెట్లు మరింత అందుబాటులోకి వచ్చాయి.

క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థల ప్రాముఖ్యత
ఈ మార్పులో క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యవస్థ, అంటే, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, రిజిస్ట్రార్లు, బ్రోకర్లు, వెల్త్‌ ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలు కేవలం మార్కెట్‌ను అందుబాటులోకి తేవడమే కాకుండా, పారదర్శకతను పెంపొందించడానికి, నిరంతర వృద్ధికి కూడా దోహదపడుతున్నాయి. ప్రస్తుతం క్యాపిటల్‌ మార్కెట్లలో కనిపిస్తున్న వృద్ధికి, రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యానికి ఇవే ప్రధాన ఆధారం. ఇలాంటి సంస్థల షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా కూడా మదుపర్లు ప్రయోజనం పొందవచ్చు.

క్యాపిటల్‌ మార్కెట్లలో భాగస్వామ్యం ఉండే సంస్థలతో రూపొందిన ఇండెక్స్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం ఇందుకు ఉపయోగపడే ఒకానొక మార్గం. ట్రేడింగ్‌ పరిమాణం పెరగడం వల్ల లాభపడే ఎక్సేంజీలు, కొత్త డీమ్యాట్‌ ఖాతాల వల్ల లబ్ధి పొందే డిపాజిటరీలు, నిర్వహణలోని ఆస్తుల పెరుగుదలతో ఆదాయం పొందే అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, వ్యవస్థకు అడ్మినిస్ట్రేషన్‌పరంగా కీలక వెన్నెముకగా వ్యవహరించే సర్వీస్ ప్రొవైడింగ్‌ సంస్థలు ఈ ఇండెక్స్‌లలో ఉంటాయి. మార్కెట్‌ భాగస్వామ్యం పెరిగే కొద్దీ ఈ వ్యాపారాలు కూడా సహజంగానే వృద్ధి చెందుతాయి.

మదుపర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
ఆదాయాలు పెరుగుతూ, పొదుపు, పెట్టుబడులు పెరిగే కొద్దీ దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు, ఎకానమీతో పాటే మరింతగా వృద్ధి చెందుతాయి. ప్రైవేట్‌ రంగానికి, మౌలిక సదుపాయాలకు, ఆవిష్కరణలకు ఇవి నిధులు సమకూరుస్తాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఆధారిత రంగాల్లో పెట్టుబడి పెట్టడం అంటే భారత భవిష్యత్తు వృద్ధిలో భాగస్వాములు కావడమే. దీర్ఘకాలికంగా ఈ రంగం ఇచ్చే ఫలితాలను అందుకోవడానికి ’ప్యాసివ్‌ స్ట్రాటజీ’ వంటి విధానాలను మదుపర్లు పరిశీలించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement