ఫండ్ రివ్వ్యూ
ఈక్విటీల్లో చక్కని వైవిధ్యంతో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి మల్టీ క్యాప్ ఫండ్స్ మంచి ఆప్షన్. పెట్టుబడులకు స్థిరత్వం కోసం లార్జ్‌క్యాప్, అధిక రాబడుల కోసం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ మధ్య పెట్టుబడులను విస్తరించడం ద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించేవే మల్టీక్యాప్ ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ అంతటగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో మెరుగైన పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం కంటే మంచి మల్టీక్యాప్‌ను ఎంపిక చేసుకోవడమే చక్కని ఆప్షన్ అవుతుంది. కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి.. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్టర్లకు మల్టీ క్యాప్ ఫండ్స్ అనుకూలం.
రాబడులు..
ఈ పథకం 2023 జనవరి 30న ప్రారంభం కాగా, నాటి నుంచి ఏటా 23.4 శాతం చొప్పున రాబడిని (పాయింట్ టు పాయింట్) అందించింది. ఇదే కాలంలో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 18.3 శాతంగానే ఉంది. ఇది మెరుగైన పనితీరును తెలియజేస్తోంది. రోలింగ్ రాబడులు (వివిధ దశల్లో పెట్టుబడులు) సైతం మూడేళ్ల కాలంలో 23 శాతం చొప్పున ఉన్నాయి. మూడేళ్ల సిప్ పనితీరును గమనిస్తే ఏటా 12.8 శాతం చొప్పున రాబడి నమోదైంది. మార్కెట్లో ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ గడిచిన ఏడాది కాల రాబడి 6.45 శాతంగా నమోదైంది.
పెట్టుబడుల విధానం..
మల్టీక్యాప్ ఫండ్స్ అన్నవి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ పథకంలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకంలో 96 స్టాక్స్ ఉండడం దీన్నే సూచిస్తోంది. పోర్ట్‌ఫోలియోలోని టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 23.19 శాతం మించలేదు. ఇది కూడా రిస్క్ వైవిధ్యంలో భాగమే. సెబీ నిబంధనల ప్రకారం అయితే మల్టీక్యాప్ ఫండ్స్ కనీసం 25 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో, 25 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో, 25 శాతం స్మాల్‌క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం నిధులను మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఫండ్ మేనేజర్ తన విచక్షణ మేరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ పరిస్థితులను బట్టి వివిధ రకాల స్టాక్స్ వేర్వేరు సమయాల్లో రాణిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో లార్జ్‌క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా రాణిస్తాయి. అదే మార్కెట్ పతనమవుతున్నప్పుడు లార్జ్‌క్యాప్‌లో నష్టాలు పరిమితంగా ఉంటాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ వల్ల అన్ని కాలాల్లోనూ లాభపడే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి వ్యాల్యూరీసెర్చ్ సంస్థ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో రూ.5,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గత పనితీరు భవిష్యత్ రాబడికి హామీ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఆ పథకం భవిష్యత్ పనితీరు ఎలా ఉంటుందో అవగాహనకు డేటా పనికొస్తుంది. ఇందులో 43.67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 27.96 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 28.37 శాతం చొప్పున కేటాయించింది. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ రంగ కంపెనీల్లో 24.91 శాతం, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 17.13 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.18 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మెటీరియల్స్ కంపెనీల్లో 9.73 శాతం పెట్టుబడులు ఉన్నాయి.


