ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్‌!

Increase In Travel Insurance Premiums Due To Covid - Sakshi

బెంగళూరు: కోవిడ్‌–19 విజృంభించిన సమయంలో ప్రయాణాలు దాదాపు నిల్చిపోయాయి. ప్రస్తుతం ట్రావెల్‌ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. దీంతో ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. కోవిడ్‌ పూర్వం 2019–20లో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్‌ పాలసీల విక్రయం పుంజుకున్నట్లు డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ వెల్లడించింది. 

తమ అంతర్గత డేటా ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తాము గతేడాది మొత్తం మీద అమ్మిన ట్రావెల్‌ పాలసీల్లో సుమారు 75 శాతం పాలసీలను ఈ ఏడాది నాలుగు నెలల్లోనే విక్రయించగలిగినట్లు పేర్కొంది. 2021–22లో 12.8 లక్షల ట్రావెల్‌ పాలసీలను విక్రయించినట్లు సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు.

 సాధారణంగా ట్రిప్‌ రద్దు కావడం, ఫ్లయిట్లు రద్దు కావడం లేదా జాప్యం జరగడం వంటి అంశాలే ట్రావెల్‌ క్లెయిమ్‌లకు కారణాలుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌–19కు పూర్వం ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను దేశీయ ప్రయాణికులు ఎక్కువగా పట్టించుకునే వారు కాదని, కాని ప్రస్తుతం అనూహ్య పరిస్థితులతో ప్రయాణాలకు అంతరాయం కలిగినా నష్టపోకుండా ఉండేందుకు చాలా మంది ఇప్పుడు ప్రయాణ బీమా పాలసీలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top