
క్రెడిట్ కార్డులు అనేవి ప్రస్తుతం ప్రతిఒక్కరికి దైనందిన జీవితంలో కనీస అవసరాలుగా మారిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులు ఇప్పుడు పెద్దలకు మాత్రమే ఆర్థిక సాధనాలు కాదు.. విద్యార్థులలో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు నిరుద్యోగులు, సరైన క్రెడిట్ హిస్టరీ లేని వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వవు. అయితే, విద్యార్థులు ఇందుకు మినహాయింపు.
చదువుల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటున్న యువత కోసం పలు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వివిధ బిల్లులు, కిరాణా సరుకులు లేదా రూం అద్దెలు వంటి చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులు రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి.. వీటిలో టాప్ ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎస్‌బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. కార్డుపై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డ్ పాయింట్, రూ.500 నుంచి రూ.3,000 మధ్య లావాదేవీలపై 2.5% ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ ఇతర క్రెడిట్ కార్డుల బకాయి బిల్లులను ఈ ఎస్‌బీఐ స్టూడెంట్ ప్లస్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డుకు తక్కువ వడ్డీ రేటుతో బదిలీ చేయవచ్చు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్
ఈ కార్డుకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ చెక్ కూడా ఉండదు. విద్యార్థులు ఎలాంటి ఆదాయ రుజువు లేకుండా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు 1,500 రెస్టారెంట్లలో 20% వరకు తగ్గింపును ఆస్వాదించవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఖర్చులపై 4 రెట్ల వరకు రివార్డులను పొందవచ్చు.
కోటక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు
ఈ కార్డులో జాయినింగ్ లేదా వార్షిక రుసుము ఉండదు. ఇది ఆల్-ఇన్-వన్ క్రెడిట్ కార్డు. ఇది 48 రోజుల వరకు వడ్డీ లేని నగదు ఉపసంహరణలు, అన్ని కొనుగోళ్లపై రివార్డులు, మీ టర్మ్ డిపాజిట్ మొత్తంలో 90% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. ఇది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు. ఇది విద్యార్థులకు ఖర్చు లేని ఎంపిక.
యాక్సిస్ బ్యాంక్ స్టూడెంట్స్ ఫారెక్స్ కార్డు
ఇది విదేశీ కరెన్సీతో లోడ్ చేసిన ఫారెక్స్ కార్డు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించారు. మీరు సందర్శించే దేశం స్థానిక కరెన్సీలో సౌకర్యవంతంగా నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒకే కార్డుపై 16 కరెన్సీలను లోడ్ చేయవచ్చు. లాక్-ఇన్ ఎక్స్ఛేంజ్ రేటు నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కరెన్సీ హెచ్చుతగ్గులపై ఎక్కువ ఖర్చు చేయకుండా నిరోధిస్తుంది.
ఐసీఐసీఐ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు
ఈ కార్డుతో బుక్ మైషో బుకింగ్స్, డైనింగ్, రైల్వే, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంధనం నింపిన ప్రతిసారీ ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌పై 1% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఇది చిప్, పిన్ సెక్యూరిటీతో వస్తుంది. ఇక్కడ మీరు మర్చంట్ అవుట్‌లెట్లలో లావాదేవీల కోసం టెర్మినల్‌పై మీ పిన్ నంబర్ నమోదు చేయాలి.