‘మొబైల్‌ విడిభాగాలపై సుంకాల్లో కోత పెట్టాలి’ | Indian Mobile Industry Urges Government To Cut Import Duties On Phone Components, More Details Inside | Sakshi
Sakshi News home page

‘మొబైల్‌ విడిభాగాలపై సుంకాల్లో కోత పెట్టాలి’

Jan 20 2026 8:36 AM | Updated on Jan 20 2026 11:09 AM

ICEA urged govt to cut import duties on mobile parts

కేంద్రానికి ఐసీఈఏ సూచన 

మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలైన మైక్రోఫోన్లు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, వేరబుల్స్‌పై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌లో ఈ మేరకు చర్యలు ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. అలాగే, దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు గాను క్యాపిటల్‌ గూడ్స్, ఇతర విడిభాగాలపై టారిఫ్‌లను సవరించాలని ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఇటీవల చైనా విధించిన నియంత్రణ చర్యలు దేశీ మొబైల్‌ ఫోన్ల తయారీకి ముప్పుగా మారతాయని పేర్కొంది.

ఐసీఈఏలో యాపిల్, ఫాక్స్‌కాన్, డిక్సన్, షావోమీ, వివో, ఒప్పో తదితర సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ‘తయారీ మెషినరీ ఎగుమతులపై చైనా ఇటీవల విధించిన ఆంక్షలు సరఫరా పరమైన సమస్యలను పెంచుతాయి. దిగుమతి పరికరాలపై భారత్‌ ఆధారపడి ఉండడం వ్యూహాత్మక బలహీనతగా మారింది. కనుక అన్ని రకాల విడిభాగాలు, సబ్‌ అసెంబ్లీలు, అసెంబ్లీల దిగుమతులపై జీరో సుంకం ప్రయోజనాన్ని వర్తింపజేయాలి’ అని ఐసీఈఏ సూచించింది. దీని ఫలితంగా స్వావలంబన పెరుగుతుందని, అంతర్జాతీయంగా భారత్‌ పోటీతత్వం ఇనుమడిస్తుందని అభిప్రాయపడింది.  

రూ.6.76 లక్షల కోట్లకు ఉత్పత్తి..

దేశీ ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమ 25 లక్షల మందికి ఉపాధి కలి్పస్తుండడం గమనార్హం. దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఐసీఈఏ అంచనా. ఇందులో 30 బిలియన్‌ డాలర్లు  మేర ఎగుమతులు ఉంటాయని పేర్కొంది. 2024–25లో రూ.5.5 లక్షల కోట్ల మొబైల్‌ ఫోన్ల తయారీ నమోదు కాగా, ఇందులో ఎగుమతులు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొన్ని రకాల సంక్లిష్టమైన, ప్రత్యేకమైన మెషినరీ అవసరం మొబైల్‌ ఫోన్లు, లిథియం అయాన్‌ సెల్‌ తయారీకి అవసరమని పేర్కొంటూ.. అయినప్పటికీ ఇవి కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపులకు దూరంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ఈ మెషినరీ దేశీయంగా తయారు కావడం లేదని, దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లించాల్సి వస్తున్నట్టు.. ఫలితంగా మూలధన వ్యయాలు 7.5–20 శాతం మధ్య అధికంగా వెచ్చించాల్సి వస్తున్నట్టు వివరించింది.

ఇదీ చదవండి: ట్రంప్‌ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement