పట్టాలెక్కిన హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌.. | Hyderabad real estate back on track | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌..

Jun 29 2025 4:53 PM | Updated on Jun 29 2025 5:03 PM

Hyderabad real estate back on track

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్‌ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్‌ స్వల్పంగా తగ్గాయని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో

హాట్‌స్పాట్‌ ప్రాంతాలివే.. 
లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్‌ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్‌లో ఈ జోన్‌ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్‌ హైదరాబాద్‌లో నానక్‌రాంగూడ ప్రధాన హాట్‌స్పాట్‌గా నిలిచింది. లాంచింగ్స్‌లో ఉత్తర హైదరాబాద్‌ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్‌లో బాచుపల్లి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్‌ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్‌ హాట్‌స్పాట్‌గా ఉంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్‌ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్‌ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.

హైఎండ్‌ లగ్జరీదే ఆధిపత్యం.. 
2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్‌లో అత్యధికంగా 83 శాతం హైఎండ్‌ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్‌లోనే లాంచింగ్‌ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్‌లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్‌రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్‌ ఉంది. లాంచింగ్స్‌లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్‌లో ఎక్కువగా ఓపెన్‌ ప్లాట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

పెరిగిన ఇళ్ల అద్దెలు.. 
నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.

ఆఫీసు స్పేస్‌ అదరహో.. 
నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్‌ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్‌కేర్‌ అండ్‌ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్‌ అండ పైనాన్షియల్స్‌ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్‌ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉంది.

సప్లయి 13.2 లక్షల చ.అ. 
ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్‌లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్‌ ప్రాజెక్ట్‌ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్‌లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్‌–2, హెచ్‌–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement