breaking news
kushmen and Wakefield report
-
పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్‌లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్‌లో నానక్‌రాంగూడ ప్రధాన హాట్‌స్పాట్‌గా నిలిచింది. లాంచింగ్స్‌లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్‌స్పాట్‌గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్‌లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్‌లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్‌లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్‌రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్‌లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్‌లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్‌కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్‌ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్‌లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. -
రియల్‌కు ఈ-కామర్స్ దన్ను!
ప్రతీది నట్టింట్లోకి వచ్చి వాలాలనే యువత ఆలోచనలకు అనుగుణంగానే విస్తరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు.. స్థిరాస్తి రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరత, ప్రతికూల ఆర్ధిక పరిస్థితుల కారణంగా విస్తరణ ప్రణాళికలను పక్కన పెట్టేసిన కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసుల స్థాపన, విస్తరణ యోచన చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. - దేశంలో ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతోన్న గిరాకీ - గతేడాది 29.5 మిలియన్ చ.అ.ల్లో విస్తరించిన ఈ-కామర్స్ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా ఈ-కామర్స్ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా.. ఇందులో ఈ-కామర్స్ వ్యాపారం వాటా దాదాపు లక్ష కోట్లు. దీన్లో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం రూ.24,000 కోట్లు. అందుకే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు తమ కార్యాలయాలు, గిడ్డంగుల స్థాపనకు, విస్తరణకు సిద్ధమయ్యాయి. 2013లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ మొత్తం 22.2 మిలియన్ చ.అ.లుగా ఉంటే.. గతేడాది 29.5 మిలియన్ చ.అ.లకు పెరిగిందని కుష్‌మెన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది నిధుల సమీకరణ, ఒప్పందాలపై దృష్టిసారించిన ఈ కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసు స్పేస్‌ను అద్దెకు తీసుకోవటంపై దృష్టిసారించాయని పేర్కొంది. ఇతర నగరాల్లో ఆఫీస్ స్పేస్: 2013 ఢిల్లీలో 84,000 చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ-కామర్స్ ఆఫీస్ స్పేస్.. గతేడాదికి 5,67,499 చ.అ.లకు చేరింది. 2013లో బెంగళూరులో 4,53,495 చ.అ.లుంటే.. గతేడాదికి 6,22,811 చ.అ.లకు పెరిగింది. ఇదిలా ఉంటే ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన గణాంకాలు కన్పించాయని కుష్‌మెన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక పేర్కొంది. రెండేళ్లుగా ముంబై, కోల్కత్తా నగరాల్లో ఆఫీసు స్పేస్ గిరాకీలో ఎలాంటి మార్పు కన్పించలేదని స్పష్టం చేసింది. గతేడాది ముంబైలో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ 27,000 చ.అ.లుగా ఉంది. కోల్‌కతాలో 4,600 చ.అ.లుగా ఉందని నివేదిక చెబుతోంది. హైదరాబాద్‌లో రెట్టింపు: 2013తో పోల్చితే గతేడాది హైదరాబాద్‌లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ గిరాకీ రెట్టింపయ్యిందని నివేదిక పేర్కొంది. 2013లో 4,100 చ.అ.లుగా ఉన్న ఆఫీస్ స్పేస్.. గతేడాది 8,542 చ.అ.లకు పెరిగింది. అయితే సమీప భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం, త్వరతగతిన అనుమతులు జారీ చేయటం వంటివి ఇందుకు కారణమని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెరైక్టర్ కళిశెట్టి పద్మభూషణ్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ లాజిస్టిక్ హబ్‌గా ఎదుగుతోంది. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారం కూడా. అలాగే నాగార్జున్‌సాగర్ రోడ్ మీదుగా చెన్నైకి, రాజేంద్రనగర్ మీదుగా బెంగళూర్‌కు, మెదక్ మీదుగా ముంబైలకు రవాణా సదుపాయం ఉండటం ఈ-కామర్స్ కంపెనీలకు కలిసొచ్చే అంశాలని’’ చెప్పారు. త్వరలోనే 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుంది. దీంతో నగరం చుట్టూ ఈ-కామర్స్ కంపెనీలు గిడ్డంగులను ఏర్పాటుచేసే అవకాశముంది. ప్రత్యేకించి బెంగళూర్, నాగ్‌పూర్, ముంబై హైవేలు గిడ్డంగుల స్థాపనకు అనుకూలమని వారి అభిప్రాయం. 36.8 మిలియన్ చ.అ.లకు: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేలా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి కారణంగా రానున్న రోజుల్లో రియల్ వ్యాపారం పుంజుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి దేశం మొత్తం మీద ఈ-కామర్స్ కంపెనీల ఆఫీస్ స్పేస్ 36.8 మిలియన్ చ.అ.లకు.. 2016 నాటికి 40.1 మిలియన్ చ.అ.లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.