
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణి
మీ పెట్టుబడులకు తగినంత దీర్ఘకాలం ఉంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఈక్విటీ మార్కెట్లన్నవి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా మంచి పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌తో ఆరంభించొచ్చు. పెట్టుబడుల్లో మూడింట రెండొంతులను ఈక్విటీలకు, మిగిలిన ఒక వంతును డెట్ సాధనాలకు ఇవి కేటాయిస్తాయి. ఈక్విటీ విభాగం ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో డెట్ పెట్టుబడులు కుషన్‌గా పనిచేస్తాయి. అచ్చమైన ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు ఆటుపోట్ల ప్రభావం హైబ్రిడ్ పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.
నెలకు రూ.5,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తూ వెళితే 12.18 శాతం రాబడుల ఆధారంగా (గత 20 ఏళ్ల సగటు రాబడి) రూ.51.25 లక్షలు సమకూరుతుంది. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్) సాధనాలకు కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడం సహజం. ఆ సమయంలో నష్టాలకు సైతం ఈక్విటీ పెట్టుబడులు అమ్మేస్తుంటారు. అలాంటి తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడుల విలువ క్షీణతను పరిమితం చేస్తాయి. మార్కెట్ల ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం ఉన్నవారు.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ను సైతం పరిశీలించొచ్చు. ఇవి లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో విభాగంలో పెట్టుబడులను మార్పులు చేర్పులు చేస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే వీటి వార్షిక రాబడి గత 20 ఏళ్లలో 12.66 శాతం చొప్పున ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కొంచెం అదనపు రాబడులను ఇవ్వగలవు.
ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో వేటిని ఎంపిక చేసుకోవాలి. – అనిరుధ్
దీర్ఘకాలంలో ఏ విభాగం అధిక రాబడులను ఇస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ (దిద్దుబాటు) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తే.. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ కంపెనీలు మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ విభాగం అధిక రాబడులను ఇస్తుంటుంది. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్‌కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్‌లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్‌ను చక్కగా అధిగమించగలరు.