
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ.. మన దేశంలో నివాస విభాగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, గృహ యజమానుల అభిరుచులతో గృహాల కొనుగోళ్లు స్థిరంగానే ఉంటున్నాయి.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 97,080 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది క్యూ3లో విక్రయమైన 1,07,060 యూనిట్లతో పోలిస్తే 9 శాతం తగ్గగా.. ఈ ఏడాది క్యూ2లో సేల్ అయిన 96,290 నివాసాలతో పోలిస్తే 1 శాతం వృద్ధి చెందాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక, 2025 క్యూ3లో 96,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో సరఫరా అయిన 98,630 యూనిట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించగా.. గతేడాది క్యూ3లో సప్లయ్ అయిన 93,750 యూనిట్లతో పోలిస్తే మాత్రం 3 శాతం పెరిగాయి. అయితే ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం 14 శాతం పెరిగింది. గతేడాది క్యూ3లో అమ్ముడైన ఇళ్ల విలువ రూ.1.33 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ3లో విక్రయమైన గృహాల విలువ రూ.1.52 లక్షల కోట్లుగా ఉంది.
లగ్జరీ ఇళ్లదే హవా..
ఇళ్ల విక్రయాలు, లాంచింగ్స్‌లో ముంబైలో అత్యధికంగా జరిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో 2025 క్యూ3లో 30,260 గృహాలు అమ్ముడుపోగా.. 29,565 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పుణెలో 16,620 ఇళ్లు విక్రయం కాగా.. 19,375 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. లాంచింగ్స్‌లో అత్యధికంగా లగ్జరీ గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల వాటా 38 శాతంగా ఉండగా.. అందుబాటు గృహాల వాటా 16 శాతంగా ఉంది. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 24 శాతం, రూ.40–80 లక్షల ధర ఉన్న మధ్యతరగతి ఇళ్ల వాటా 23 శాతంగా ఉంది.
5.64 లక్షల ఇన్వెంటరీ..
అమ్మకానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) యూనిట్ల సంఖ్య గతేడాది క్యూ3లో 5.64 లక్షలుగా ఉండగా.. ఈ క్యూ3 నాటికి 5.61 లక్షలకు తగ్గాయి. ఏడాదిలో ప్రాపరీ్టల ధరలు 9 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో ధరలు 24 శాతం పెరగగా.. బెంగళూరులో 10 శాతం వృద్ధి చెందాయి.
హైదరాబాద్‌లో..
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 8,630 గృహాలు లాంచింగ్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ప్రారంభమైన 13,890 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. ఏడాది కాలంలో నగరంలో లాంచింగ్స్ 22 శాతం మేర తగ్గాయి. నగరంలో ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాల డిమాండ్ కొనసాగుతోంది. అందుకే ఈ క్యూ3లో లాంచింగ్ అయిన యూనిట్లలో రూ.80 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 87 శాతంగా ఉంది. ఇక, 2025 క్యూ3లో నగరంలో 11,305 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయమైన 12,735 ఇళ్లతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ.
ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..