
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరణాలరేటు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొబైల్ వినియోగదారులకు కాల్స్, టెక్ట్స్ రూపంలో అలర్టులు అందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సొల్యూషన్స్(సీబీఎస్) ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం సాయంతో ఈ సేవల ప్రారంభించాలని యోచిస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలతో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్(సీఏపీ)తో స్థానిక ప్రజలకు మెసేజ్‌లు, కాల్స్ రూపంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. దానివల్ల ప్రమాదం జరగడానికి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రజలకు ముందుగానే సమాచారం అందిస్తే అందుకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు!
ఐఎండీ, సీడబ్ల్యూసీ, ఎన్‌సీఎస్ వంటి కేంద్ర సంస్థల సహాయంతో ప్రభుత్వం ఈ అలర్టులు పంపే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ సదుపాయం వల్ల అటవీ ప్రాంతాలు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, గతేడాది పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని మొబైల్ వినియోగదారుల ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం ఈ అలర్టు సర్వీసును పరీక్షించింది.