12 శాతం అధికంగా నియామకాలు

Hiring Rises 12 Pc In January-May This Year - Sakshi

జనవరి–మార్చిపై ఆల్‌సెక్‌ టెక్‌ నివేదిక

తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో సానుకూలం

ముంబై: దేశంలో ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 12 శాతం పెరిగినట్టు ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. నైపుణ్య సేవలు, తయారీరంగం, బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ కామర్స్, ఐటీ/ఐటీఈఎస్‌ రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా కంపెనీలు కఠిన విధానాలను అవలంబిస్తున్నాయి.

కానీ, భారత్‌లో మాత్రం నియామకాలు గతేడాదితో పోలిస్తే మెరుగుపడ్డాయి. 2023 జనవరి–మే మధ్య నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 12 శాతం పెరిగాయి. భారత కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతులను అధిగమించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్‌ పెట్టుబడులు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది రానున్న సంవత్సరాల్లో ఉపాధికి ఊతమిస్తుంది’’అని ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌ సీఈవో నాజర్‌ దలాల్‌ తెలిపారు. భారత్‌ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు.

నిపుణులకు డిమాండ్‌  
నైపుణ్య సేవల రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు రెట్టింపయ్యాయి. ట్యాక్సేషన్, బిజినెస్‌ కన్సలి్టంగ్, రిస్క్‌ అడ్వైజరీ, డీల్‌ అడ్వైజరీ, టెక్నాలజీ సేవలు, పర్యావరణం, సామాజిక, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) సేవల్లో నియామకాల జోరు కనిపించింది. తయారీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూడగా 50 శాతం వృద్ధి కనిపించింది.

భారత ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుండడం సానుకూలంగా ఈ నివేదిక తెలిపింది. ఫలితంగా ఇది ఉపాధికి మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్‌ రంగాల్లోనూ నియామకాలు 16 శాతం అధికంగా జరిగాయి. బ్యాంక్‌లు పనితీరు మెరుగుపడడం, రుణాలకు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. ఇంటర్నెట్‌ విస్తరణ ఈ కామర్స్‌ రంగానికి అనుకూలమని తెలిపింది. వ్యాపారానికి మరింత అనుకూలమైన వాతావరణం, భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా చేయాలని కేంద్రం భావిస్తుండడం భవిష్యత్తులో మరింతగా ఉపాధి కల్పనకు దారితీస్తుందని విశ్లేశించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top