
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు, సైబర్ ముప్పులను అధిగమించేందుకు కంపెనీల్లోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రస్తుతం కృత్రిమ మేథ (ఏఐ) వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా మూడో వంతు సైబర్‌సెక్యూరిటీ లీడర్లు ఏఐ ఆధారిత ఆటోమేషన్‌కే ప్రాధాన్యతనిస్తామంటున్నారు. ఐటీ దిగ్గజం విప్రో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
నివేదిక ప్రకారం.. సైబర్ సెక్యూరిటీని పెంచుకునేందుకు, బడ్జెట్లను అదుపులో ఉంచుకునేందుకు ఏఐ ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యతనిస్తామని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లలో (సీఐఎస్‌వో) 30 శాతం మంది తెలిపారు. సాధనాలను క్రమబద్దీకరించుకోవడం (26 శాతం మంది), సెక్యూరిటీ.. రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను మెరుగుపర్చుకోవడం (23 శాతం), నిర్వహణ విధానాలను సరళతరం చేసుకోవడం (20 శాతం) ద్వారా కూడా ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘సైబర్ ముప్పులు చాలా వేగంగా అధునాతన రూపు సంతరించుకుంటున్నాయి. ఆ స్థాయిలో సైబర్‌సెక్యూరిటీ బడ్జెట్లను పెంచుకోవడం కష్టతరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయాలతో రక్షణ వ్యవస్థాలను పటిష్టం చేసుకునేందుకు కంపెనీలకి ఏఐ ఉపయోగపడుతుంది. అందుకే సీఐఎస్‌వోలు దీనిపై దృష్టి పెడుతున్నారు‘ అని విప్రో ఎస్‌వీపీ టోనీ బఫోమెంట్ తెలిపారు.
నివేదిక ప్రకారం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడానికే కాకుండా ముప్పులను గుర్తించే సామర్థ్యాలను పెంచుకునేందుకు, సత్వరం స్పందించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నట్లు 31 శాతం మంది వివరించారు. అధునాతన ఏఐ ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, నిరంతరాయంగా ఏఐ పరిణామాలను పర్యవేక్షిస్తుండటం, సైబర్‌సెక్యూరిటీ సిబ్బందిలో కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడంలాంటి అంశాలు రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు కీలకంగా మారాయని నివేదిక పేర్కొంది.