కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్‌ ప్లాన్లు తీసుకోవచ్చా?  | Sakshi
Sakshi News home page

Health Insurance: కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్‌ ప్లాన్లు తీసుకోవచ్చా? 

Published Mon, Dec 11 2023 7:56 AM

Health Insurance Can two top-up plans be taken - Sakshi

నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.40 లక్షల సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ను మరో బీమా సంస్థ ఆఫర్‌ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్‌ టాపప్‌ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్‌ టాపప్‌ ప్లాన్లను కలిగి ఉండొచ్చా?     – తన్మోయ్‌ పంజా 

టాపప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ అనేది డిడక్టబుల్‌కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్‌ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్‌ టాపప్‌ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకునేందుకు బేసిక్‌ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్‌ టాపప్‌ ప్లాన్‌లో డిడక్టబుల్‌ అనేది హాస్పిటల్‌లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్‌ టాపప్‌ ప్లాన్‌లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్‌ ఖర్చులకు డిడక్టబుల్‌ అమలవుతుంది. కనుక టాపప్‌ ప్లాన్లతో పోలిస్తే సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి.

ఒకే సమయంలో రెండు సూపర్‌ టాపప్‌ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ఆఫర్‌ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్‌ పాలసీలో లేని రక్షణను సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్‌ ప్లాన్‌ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్‌తో రూ.5 లక్షల సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.10 లక్షలకు మరో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు.

ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్‌ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్‌ టాపప్‌ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్‌ టాపప్‌ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్‌ పాలసీకి అదనంగా ఒక సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్‌ కోసం చేయాల్సిన పేపర్‌ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి.   

నేను 1994లో మోర్గాన్‌ స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్‌ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత?     – వచన్‌ 

2014లో మోర్గాన్‌ స్టాన్లీ భారత్‌ మార్కెట్‌ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్‌ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. మోర్గాన్‌ స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌లో విలీనం అయింది. హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ 2009 వరకు హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా కొనసాగింది.

15 ఏళ్ల లాకిన్‌ పీరియడ్‌ ముగిసిన అనంతరం ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్‌డీఎఫ్‌సీ అస్సె ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్‌ స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది.  

సమాధానాలు ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

Advertisement
 
Advertisement