
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ, ఎన్‌ఆర్ ఖాతాదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సేవలపై ఛార్జీలను పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తన బ్రాంచ్‌లలో ఫిజికల్‌గా అందించే సేవలకు సంబంధించి ఛార్జీలను సవరించి కొత్త రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా నగదు లావాదేవీలు, సర్టిఫికెట్ సేవలు, పాత రికార్డుల ప్రతులు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపు
ముందుగా నగదు లావాదేవీల ఉచిత పరిమితిలో కీలకమైన మార్పు జరిగింది. ఇంతకు ముందు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు ఉండేవి. వాటి మొత్తం పరిమితి రూ.2 లక్షలు. ఇప్పుడు అదే నాలుగు లావాదేవీలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తం పరిమితిని రూ.1 లక్షకు తగ్గించారు. అంటే ఖాతాదారులు నెలకు రూ.1 లక్ష వరకు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఆ పరిమితిని మించితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ.150 ఛార్జీ వసూలు చేయనున్నారు.
కొత్త ఛార్జీలు
అలాగే బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ వంటి సేవలకు కూడా ఛార్జీలు విధించారు. రెగ్యులర్ కస్టమర్లకు రూ.100, సీనియర్ సిటిజన్లకు రూ.90 చొప్పున వసూలు చేయనున్నారు. ఇదే విధంగా పాత రికార్డులు, పెయిడ్ చెక్కుల కాపీల కోసం రెగ్యులర్ ఖాతాదారులు రూ.80, సీనియర్ సిటిజన్లు రూ.72 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ సేవలు ఉచితంగా అందించేవారు. కానీ ఇప్పుడు వాటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లకూ..
ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసీఎస్,ఏసీహెచ్ రిటర్న్ ఛార్జీలను సవరించారు. మొదటి రిటర్న్‌కు రూ.450 (సీనియర్ సిటిజన్‌కు రూ.400), రెండవ రిటర్న్‌కు రూ.500 (సీనియర్‌కు రూ.450), మూడవ రిటర్న్ నుంచి రూ.550 (సీనియర్‌కు రూ.500) వసూలు చేయనున్నారు. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలను కూడా కొత్త రేట్లతో అమలు చేస్తున్నారు.
ఉదాహరణకు, నెఫ్ట్ ద్వారా రూ.10,000 లోపు ట్రాన్సాక్షన్‌కు రూ.2, రూ.1 లక్ష వరకు రూ.4, రూ.2 లక్ష వరకు రూ.14, 2 లక్షల పైగా రూ.24 చొప్పున ఛార్జీలు విధించనున్నారు. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలు–రూ.5లక్షలు మధ్య ట్రాన్సాక్షన్‌కు రూ.20, రూ.5లక్షలకుపైగా లావాదేవీకి రూ.45 వసూలు చేస్తారు. ఐఎంపీఎస్ ద్వారా రూ.1,000 లోపు ట్రాన్సాక్షన్‌కు రూ.2.50, రూ.1లక్ష లోపు అయితే రూ.5, రూ.1లక్షకు పైగా లావాదేవీకి రూ.15 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి.