అమెరికా హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తుదారులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది.
భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో, ఇప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్లు సమాచారం.
వాస్తవానికి 2025 డిసెంబర్‌లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్‌మెంట్లను 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్‌కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్‌మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ కూడా వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయని సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.

ఉద్యోగాలు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం
ఈ జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా, వారు మాత్రం భారత్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


