జీఎస్టీ కౌన్సిల్‌ 57వ సమావేశం వాయిదా | GST Council 57th Meeting Postponed Rescheduled To October 8 | Sakshi
Sakshi News home page

జీఎస్టీ కౌన్సిల్‌ 57వ సమావేశం వాయిదా

Oct 6 2026 12:25 AM | Updated on Oct 6 2026 12:28 AM

GST Council 57th Meeting Postponed Rescheduled To October 8

న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌ 57వ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 7న జరగాల్సిన ఈ సమావేశాన్ని అక్టోబర్‌ 8కి వాయిదా వేసినట్లు జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ సోమవారం జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో వెల్లడించింది. అనివార్య పరిస్థితుల కారణంగా సమావేశాన్ని రీషెడ్యూల్‌ చేసినట్లు పేర్కొంది.

సవరించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 8న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని భారత్‌ మండపం సమ్మిట్‌ రూమ్‌లో 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. సమావేశ తేదీలో మార్పును కౌన్సిల్‌ సభ్యులకు తెలియజేసిన సెక్రటేరియట్‌.. సంబంధిత సభ్యుల దృష్టికి సవరించిన కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌-అఫీషియో సెక్రటరీ అయిన రెవెన్యూ కార్యదర్శి ఆమోదంతో మెమోరాండం జారీ అయింది.

కీలక పన్ను అంశాలపై చర్చకు అవకాశం

కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. దేశంలో వస్తువులు, సేవలపై పన్నులకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఇదే. దీంతో 57వ సమావేశంలో పలు పన్ను సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

అయితే సమావేశాన్ని అక్టోబర్‌ 8కి వాయిదా వేస్తూ జారీ చేసిన తాజా మెమోరాండంలో ఎజెండా అంశాలను సెక్రటేరియట్‌ వెల్లడించలేదు. సాధారణంగా కౌన్సిల్‌ సమావేశానికి ముందు చర్చించాల్సిన ప్రతిపాదనలు, అంశాలను సభ్యులకు పంపిణీ చేస్తారు. సెప్టెంబర్‌ 6న జారీ చేసిన కార్యాలయ మెమోరాండం ద్వారా గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ను సభ్యులకు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement