ఎలక్ట్రిక్‌ వాహనదారులకు ఊరట.. తగ్గనున్న బ్యాటరీల ధరలు! | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు ఊరట.. తగ్గనున్న బ్యాటరీల ధరలు!

Published Thu, Oct 19 2023 8:14 AM

Govt to roll out another PLI scheme for batteries - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్తు వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. ఎందుకంటే విద్యుత్తు వాహనాల్లో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. దేశం విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా బ్యాటరీలపై మరో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రవేశపెట్టనున్నట్లు  కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌  ప్రకటించారు.  ఢిల్లీలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. 

అమ్మకాల పెరిగే బ్యాటరీల ధరలు తగ్గుతాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి పీఎల్‌ఐ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో బ్యాటరీల తయారీ సామర్థ్యం పరిమితంగా ఉన్నందునే ధరలు అధికంగా ఉన్నాయని, దీనికి తోడు  ఒకసారి ఛార్జ్‌ చేస్తే ప్రయాణఙంచే దూరం కూడా తక్కువగా ఉండటం వల్లనే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం అంతగా ఊపందుకోవడం లేదని ఆయన వివరించారు. 

అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీలకు రూ.18,100 కోట్లతో కేంద్ర సర్కారు 2021 మే నెలలో పీఎల్‌ఐ ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దీని ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ఉద్దేశ్యం. దీని ద్వారా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని దేశీయంగా సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది. 

ఏసీసీ అనేది బ్యాటరీ స్టోరేజీలో అత్యాధునిక టెక్నాలజీతో కూడినది. విద్యుత్‌ను ఎలక్ట్రో కెమికల్‌ లేదా కెమికల్‌ ఎనర్జీ రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుచ్ఛక్తి మారుస్తుంది. ఈవీల వాడకం వల్ల దేశీయంగా కాలుష్యం తగ్గుతుందని మంత్రి సింగ్‌ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో లిథియం నిల్వలు బయటపడడాన్ని అదృష్టంగా పేర్కొన్నారు.  

విద్యుత్‌కు భారీ డిమండ్‌.. 
సోడియం అయాన్‌ బ్యాటరీలపై పరిశోధనలు జరుగుతున్నాయని, సత్పలితాలు వస్తే మంచిదని మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. ప్రత్యామ్నాయ కెమిస్ట్రీ అనేది తప్పనిసరిగా పేర్కొన్నారు. ‘‘విద్యుత్‌కు డిమాండ్‌ ఆగస్ట్‌లో 20 శాతం పెరిగినట్టు మంత్రి చెప్పారు. సెప్టెంబర్‌లోనూ 20 శాతం పెరిగిందని, అక్టోబర్‌లో మొదటి 14 రోజుల్లో 16 శాతం అధిక డిమాండ్‌ నమోదైనట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement