
2024 - 25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటును ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి.
ఈపీఎఫ్ వడ్డీ రేటు.. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా జీతం పొందే చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2023-24 సంవత్సరానికి అందించే రేటునే.. ఈ ఏడాది కూడా కొనసాగించారు. 2022-23 సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండేది.
ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి.
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.
ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
పీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు.