
ప్రపంచ కుబేరుల్లో దానశీలత పెరుగుతోంది. వివిధ సందర్భాల్లో విరాళాలు ఇస్తూ తమ వితరణ గుణం చాటుకుంటున్నారు కార్పొరేట్ సంపన్నులు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తాజాగా భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. 700 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.6,000 కోట్ల విలువైన ఆల్ఫాబెట్ షేర్లను ఆయన విరాళంగా ఇచ్చినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది.
దానమిచ్చింది వీటికే..
బ్లూమ్ బర్గ్ న్యూస్ కథనం ప్రకారం.. సెర్గీ బ్రిన్ తాజా విరాళంలో ఎక్కువ భాగం నాడీ సంబంధిత వ్యాధులు, వాతావరణ మార్పు పరిష్కారాలపై పరిశోధన నిమిత్తం కాటలిస్ట్4 సంస్థకు వెళ్లింది. ఈ లాభాపేక్షలేని సంస్థను స్వయంగా ఆయనే స్థాపించారు. 5.8 లక్షల ఆల్ఫాబెట్ షేర్లను బ్రిన్ తన కుటుంబ ఫౌండేషన్ కు కేటాయించగా మరో 2.82 లక్షల షేర్లను పార్కిన్సన్ వ్యాధి పరిశోధనలు చేసే మైఖేల్ జె ఫాక్స్ ఫౌండేషన్ కు ఇచ్చారు. బ్రిన్ మొత్తం 4.1 మిలియన్ ఆల్ఫాబెట్ షేర్లను విరాళంగా ఇచ్చినట్లు ఇదివరకే రెగ్యులేటరీ ఫైలింగ్స్ వెల్లడించాయి. అయితే గ్రహీతలు ఎవరన్నది అప్పుడు తెలియలేదు.
👉 ఇది చదివారా? అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
గతంలోనూ..
సెర్గీ బ్రిన్ భారీ మొత్తంలో విరాళాలు అందించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో గూగుల్ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ లాంచ్ సందర్భంగా 600 మిలియన్ డాలర్లు, 2024లో మరో 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం.. సెర్గీ బ్రిన్ 2004లో గూగుల్ ఐపీఓకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 11 బిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు.
దానాలకు పోయినా అత్యంత ధనవంతుడే...
బ్రిన్ 2019 లో ఆల్ఫాబెట్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగినప్పటికీ, బోర్డులో మాత్రం కొనసాగుతున్నారు. రష్యాలో జన్మించిన బ్రిన్ ఆరేళ్ల వయసులోనే సెమెటిక్ వ్యతిరేక హింస నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు వలస వచ్చారు. 1998లో స్టాన్‌ఫోర్డ్‌లో చదువుతున్నప్పుడు ల్యారీ పేజ్‌తో కలిసి గూగుల్‌ను స్థాపించారు. అలా ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒక్కరయ్యారు. భారీ స్థాయిలో విరాళాలు, వితరణలు పోయినా కూడా 51 ఏళ్ల బ్రిన్ సంపద 134 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.11.52 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 8వ స్థానంలో ఉన్నారు.