
రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బేజారవుతున్నారు. తులం (10 గ్రాములు) పసిడి ఇప్పటికే లక్ష రూపాయాలకు అటు ఇటుగా ధర పలుకుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చల్లని కబురు చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు, రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ మందగించడం కూడా మధ్యకాలిక బంగారం ధర సర్దుబాటుకు దారితీస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది.
రూ.లక్షకు అంచున బంగారం
దేశంలో ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.99,860 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి గోల్డ్ బుల్ రన్ విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న పడిపోయిన తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. ఔన్సుకు 1,429 డాలర్ల నుండి 3,287 డాలర్లకు ఎగిసింది. అంటే ఏడాదికి 30% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి వాణిజ్య అనిశ్చితులు దీనికి కారణమవుతున్నాయి.
బంగారం ధర ఎప్పకప్పుడు కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం ధరల్లో మునుపటి ఒడిదుడుకులను అధ్యయనం చేసిన మీదట మధ్య లేదా ధీర్ఘకాలిక క్షీణతకు దారితీసిన సందర్భాలు కనిపించాయి. అయితే "మేము వీటిని పరిగణనలోకి తీసుకోనప్పటికీ, దీర్ఘకాలిక ఉపసంహరణలు మరింత స్థిరమైన, నిర్మాణాత్మక డిమాండ్ మార్పుల నుండి రావచ్చు. ఇది సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుండి బంగారం పెట్టుబడి డిమాండ్‌లో గణనీయమైన క్షీణతకు, సరఫరాలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది" అని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.