వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లోకి ‘గోద్రెజ్‌’ ఎంట్రీ.. రూ.లక్ష కోట్లు టార్గెట్‌! | Godrej Wealth Launches New Platform Targets Rs 1 Lakh Crore AUM In 5 Years And Expand To 35 Locations | Sakshi
Sakshi News home page

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లోకి ‘గోద్రెజ్‌’ ఎంట్రీ.. రూ.లక్ష కోట్లు టార్గెట్‌!

Jun 4 2026 4:58 PM | Updated on Jun 4 2026 5:32 PM

Godrej Wealth Launches New Platform Targets Rs 1 Lakh Crore AUM in 5 Years

ముంబై: వినియోగ వస్తువులు, రసాయనాలు, రియల్‌ ఎస్టేట్, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది.  ’గోద్రెజ్‌ వెల్త్‌’  పేరుతో కొత్త వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్‌ కాపిటల్‌తో కలిసి ఈ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆర్థిక సేవలు అందిస్తుంది.

గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణానికి (ఏయూఎం) సంబంధించి 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆఖరు నాటికి రూ. 38,000 కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ మనీష్‌ షా తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దీన్ని రూ. 1,00,000 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, గోద్రెజ్‌ ఫైనాన్స్‌ విభాగాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఏయూఎం గత ఆర్థిక సంవత్సరం రూ. 28,000 కోట్లుగా నమోదైంది. వెల్త్‌ బిజినెస్‌ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు.

ముందుగా ఎనిమిది కీలక నగరాలతో ప్రారంభించి వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారాన్ని 35 ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రూ. 2 కోట్లకు పైబడి అసెట్స్‌ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఇది సరీ్వసులు అందిస్తుంది. ఇక గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రస్తుతం 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది 200 పైచిలుకు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు షా వివరించారు. అలాగే సప్లై చెయిన్‌ ఫైనాన్స్, గోల్డ్‌ లోన్స్‌ సహా మూడు కొత్త వ్యాపార విభాగాలు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement