
తెలంగాణ రాష్ట్రం 2025 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. మే 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కేవలం ఇది ఒక ప్రతిష్ఠాత్మక అందాల పోటీ మాత్రమే కాదు. స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడే కార్యక్రమం. వినోదం, స్పాన్సర్‌షిప్‌లు, పర్యాటకం, డొనేషన్స్‌ను సమ్మిళితం చేసే శక్తివంతమైన ప్రపంచ వ్యాపార నమూనా. 130కిపైగా దేశాల నుంచి అందగత్తెలు, జడ్జీలు, కార్యక్రమాన్ని ఎండార్స్ చేసే కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తారు. ఈ ఈవెంట్ చుట్టూ జరిగే వ్యాపార ధోరణులను విశ్లేషిద్దాం.
స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలు
ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ కంపెనీలతో సహా ప్రధాన బ్రాండ్లు గ్లోబల్ విజిబిలిటీ కోసం ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రఖ్యాత కాస్మెటిక్ దిగ్గజాలు, ఆభరణాల డిజైనర్లు, లగ్జరీ ఫ్యాషన్ హౌజ్‌ల పోటీదారులు ఈవెంట్ సెగ్మెంట్లను స్పాన్సర్ చేస్తూ హై-ప్రొఫైల్ మార్కెటింగ్ అవకాశాన్ని అందుకోవచ్చు.
బ్రాడ్‌కాస్టింగ్, మీడియా హక్కులు
ఈ అందాల పోటీని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ప్రత్యేక ప్రసార హక్కుల కోసం నెట్‌వర్క్ సంస్థలు పోటీ పడుతుంటాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పే-పర్-వ్యూ మోడల్స్, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్ ఇంటిగ్రేషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు.
పర్యాటకం
ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర దేశాల ప్రముఖులు హైదరాబాద్ రానున్నారు. దాంతో స్థానికంగా ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, స్థానిక వ్యాపారాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. స్థానిక పర్యాటకం, సాంస్కృతిక సంపదను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు.
టికెట్ అమ్మకాలు, వీఐపీ ప్యాకేజీలు
ప్రీమియం సీటింగ్, లగ్జరీ అనుభవాలు, గాలా డిన్నర్లతో మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇది టికెట్ ఆదాయానికి దోహదం చేస్తుంది. వీఐపీలు, స్పాన్సర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానా
బ్రాండ్ ప్రమోషన్
మిస్ వరల్డ్ ఈవెంట్‌లో సుందరీమణులు ధరించే బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీల ద్వారా కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కో-బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు.