బ్యాంకింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఫిన్‌టెక్‌.. ఆర్బీఐ రిపోర్ట్‌ ఏం చెప్పింది?

Fintech can emerge as substitute for traditional banking RBI CAFRAL - Sakshi

ముంబై: సమీప భవిష్యత్తులో సాంప్రదాయ బ్యాంకింగ్‌కు ఫిన్‌టెక్‌ రంగం ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ అండ్‌ లెర్నింగ్‌ (కెఫ్రాల్‌) ఒక నివేదికలో పేర్కొంది. డిజిటలీకరణ వృద్ధికి, ఆర్థిక స్థిరత్వ సాధనకు ఎప్పటికప్పుడు తగు విధంగా మల్చుకోగలిగే నియంత్రణ విధానాలు అవసరమని తెలిపింది. ఇండియా ఫైనాన్స్‌ రిపోర్ట్‌ 2023 పేరిట కెఫ్రాల్‌ రూపొందించిన తొలి ప్రచురణను రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విడుదల చేశారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 2011లో కెఫ్రాల్‌ను లాభాపేక్ష రహిత సంస్థగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది. దేశీయంగా బ్యాంకింగేతర ఆర్థిక రంగ స్థితిగతులను అర్థం చేసుకోవడంలో నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు సహా సంబంధిత వర్గాలకు సహాయకరంగా ఉండే అంశాలను తాజా నివేదికలో పొందుపర్చారు. దేశీ సాంకేతిక తోడ్పాటుతో భారత్‌లో డిజిటలీకరణ వేగవంతమవుతోందని, డిజిటల్‌ రుణాలు.. ముఖ్యంగా ఫిన్‌టెక్‌ రుణాలు గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) పరిచయం ఫిన్‌టెక్‌కు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అతిపెద్ద విజయాన్ని అందించిందని, దాని విస్తరణను వేగవంతం చేసి దేశవ్యాప్తంగా ఆర్థిక చేరికకు కొత్త అవకాశాలను సృష్టించిందని పేర్కొంది. అయితే, వృద్ధిని సులభతరం చేయడంతోపాటు స్థిరత్వాన్ని కొనసాగించేందుకు డిజిటల్ రుణాల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని నివేదిక స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top