ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పారదర్శకత పెంచే దిశగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) కీలక అడుగు వేసింది. గ్లూటెన్‌తో సీలియాక్ వ్యాధి(గ్లూటెన్ తీసుకున్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి పొరపాటున చిన్న పేగులపై దాడి చేస్తుంది) వస్తున్నందున కోట్లాది మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. గ్లూటెన్ కలిగిన ధాన్యాల లేబెలింగ్, ‘క్రాస్-కాంటాక్ట్’(ఇతర ధాన్యాలతో కలయిక ) నివారణపై సమగ్ర సమాచారాన్ని కోరుతూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
లేబెలింగ్‌లో పారదర్శకతే లక్ష్యం
ప్రస్తుతం అనేక ఆహార ఉత్పత్తుల్లో గోధుమలతో పాటు రై (rye), బార్లీ (barley) వంటి ధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల సీలియాక్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఎఫ్‌డీఏ కొన్ని అంశాలపై దృష్టి సారించింది. రై, బార్లీ కలిగిన ఉత్పత్తుల లేబెలింగ్ విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితమైనప్పటికీ ఇతర ధాన్యాలతో కలయిక(క్రాస్ కాంటాక్ట్) వల్ల వాటిలో గ్లూటెన్ చేరే అవకాశం ఉంది. దీనిపై స్పష్టమైన డేటాను సేకరిస్తోంది. ఈ ధాన్యాల వల్ల కలుగుతున్న ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు, అలర్జీల తీవ్రతను అంచనా వేయనుంది.
ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టీ మకరీ మాట్లాడుతూ ‘సీలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు తాము తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా సందర్భాల్లో కచ్చితమైన సమాచారం లేక వారు ఆహారం తీసుకునే విషయంలో కేవలం అంచనాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
డేటా లోపాలపై దృష్టి
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నివేదికలు, కొంతమంది ప్రజల నుంచి అందిన పిటిషన్లను సమీక్షించిన ఎఫ్‌డీఏ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో కొన్ని అంశాలను గుర్తించింది. ఆహార పదార్థాల్లో రై లేదా బార్లీ ఉన్నప్పటికీ వాటి వివరాలు వెల్లడించట్లేదు. దీనివల్ల ‘ఇమ్యూనోగ్లోబులిన్-E’ (IgE) ఆధారిత ఆహార అలర్జీల తీవ్రత పెరుగుతోంది. క్రాస్-కాంటాక్ట్ వల్ల ఓట్స్‌లో గ్లూటెన్ పరిమాణం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే కఠిన నియంత్రణ చర్యలకు ఈ సమాచార సేకరణ పునాదిగా మారుతుందని, తద్వారా వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆహారం లభింస్తుందని సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: ఇకపై సిల్వర్ రీసైక్లింగ్


