ఎఫ్‌డీఏ వ్యాక్సిన్స్‌ విభాగం హెడ్‌గా ఇండియన్‌ అమెరికన్‌ | Indian-American Vinay Prasad takes charge as US vaccine chief | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఏ వ్యాక్సిన్స్‌ విభాగం హెడ్‌గా ఇండియన్‌ అమెరికన్‌

May 8 2025 4:01 AM | Updated on May 8 2025 4:01 AM

Indian-American Vinay Prasad takes charge as US vaccine chief

వాషింగ్టన్‌: అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) వ్యాక్సిన్‌ విభాగం సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (సీబీఈఆర్‌) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన హెమటాలజిస్ట్‌–ఆంకాలజిస్ట్‌ వినయ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ కమిషనర్‌ మార్టి మకారీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసాద్‌కు మెడిసిన్‌లో సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్ర ఉందని, ఆయన ఆంకాలజీలో విస్తృతమైన పరిశోధనలు చేశారని మకారీ పేర్కొన్నారు. 

సీబీఈఆర్‌.. ఎఫ్‌డీఏ కింద ఉన్న టీకాలు, ఔషధాలను పర్యవేక్షిస్తుంది. ప్రసాద్‌ గతంలో ఎఫ్‌డీఏను, కోవిడ్‌–19 వాక్సిన్స్, మాస్క్‌ ఆదేశాలను తీవ్రంగా విమర్శించడం గమనార్హం. కోవిడ్‌ సమయంలో ప్రసాద్‌ తన బ్లాగులో, సోషల్‌ మీడియా వేదికలపై సీబీఈఆర్‌ అప్పటి డైరెక్టర్‌ మార్క్స్‌ నాయకత్వాన్ని తీవ్రంగా ఖండించారు. పాఠశాల మూసివేతలు, మాస్క్‌ విధానాలు, కోవిడ్‌ –19 బూస్టర్‌ షాట్‌ను వ్యతిరేకించారు. అందుకు ప్రస్తుత ఎఫ్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ మార్టి మకారీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ నియమాకంపై సీబీఈఆర్‌ మాజీ డైరెక్టర్‌ పీటర్‌ మార్క్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, సీబీఈఆర్‌ డైరెక్టర్‌గా ప్రసాద్‌ నియామకం తరువాత వ్యాక్సిన్‌ తయారీ సంస్థ మోడెర్నా (నాస్డాక్‌: ఎంఆర్‌ఎన్‌ఏ) షేర్లు సుమారు 10 శాతం క్షీణించాయి. ఫైజర్‌ షేర్లు 3 శాతం తగ్గాయి. సరెప్టా థెరప్యూటిక్స్, టేషా జీన్‌ థెరపీస్‌ వంటి చిన్న జన్యు చికిత్స సంస్థలు తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. సుమారు 20% పడిపోయాయి. చికాగో విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందిన ప్రసాద్‌.. నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో సేవలందించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement