
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఫేమ్ II స్కీమ్ కింద రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో జోడించడానికి ప్రోత్సాహకాలను అందిస్తోంది.
ఫేమ్ II గడువు ముగిసిన తర్వాత అమలు చేయడానికి సిద్దమవుతున్న ఫేమ్ III అంత విస్తృతంగా ఉండకపోవచ్చని, రానున్న బడ్జెట్‌లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశ్రమలకు సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఫేమ్ III ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది.
FAME IIIని రాబోయే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి సీతారామన్ నిస్సందేహంగా ప్రవేశపెడతారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఫేమ్ III కూడా ఫేమ్ II మార్గదర్శకాలనే కొనసాగించే అవకాశం ఉంది.
2021 సెప్టెంబర్ 15న PLI-ఆటో స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఐదేళ్లకు రూ. 25,938 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ పథకం 2027-28 ముగిసే వసరకు పొడిగించారు. అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తి తయారీని పెంచడం, దాని కోసం లోతైన స్థానికీకరణను ప్రోత్సహించడం, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-అమర్చిన వాహనాల వంటి జీరో ఎమిషన్ వెహికల్స్ (ZEVలు) కోసం ప్రపంచ సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ పధకం ముఖ్య లక్ష్యం.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం ఈ ఆశలను నిజం చేస్తుందా? లేక షాకిస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రోత్సాహాలు అవసరం, కాబట్టి రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2024-25 బడ్జెట్ కథనాల కోసం క్లిక్ చేయండి.