
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్‌సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.
డెలాయిట్, కేపీఎంజీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?
సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి.