
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బాస్మతి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్(ఏఐఆర్ఈఏ) స్పందించింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇటీవల బాస్మతి బియ్యం ధరలు పెరగడానికి భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ డిమాండ్ పెరగడమే ధరలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది. ధరల పెరుగుదల మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి బలమైన డిమాండ్ నెలకొందని వివరించింది.
అంతర్జాతీయ డిమాండ్
బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మిడిల్‌ఈస్ట్రన్ దేశాల్లో ఈ బియ్యానికి ఆదరణ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆ ప్రాంతాల్లో పెరిగిన దిగుమతి డిమాండ్ ధరలపై ఒత్తిడిని పెంచింది. ఇది దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతి ప్రాంతాల్లో ఒక మోస్తరు ధరల పెరుగుదలకు దారితీసింది.
ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం
1509, 1718తో సహా ప్రసిద్ధ బాస్మతి రకాల ధర ఇటీవల పెరిగింది. ఇది ఫిబ్రవరి 2025లో కేజీ రూ.52గా ఉండేది. ఇటీవల దీని ధర పెరిగి కేజీ రూ.58కు చేరింది. కానీ ఇది 2024 సెప్టెంబర్‌లో రూ.62గా ఉంది. అప్పటి ధరల కంటే ప్రస్తుత ధరలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయగా, పాకిస్థాన్ 1 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది.