
సీఐఎల్, ఏఎం గ్రీన్ భాగస్వామ్యం
దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన సరఫరా కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఏఎం గ్రీన్ ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఐఎల్ సోలార్, పవన శక్తి ద్వారా ఏఎం గ్రీన్ ఉత్పత్తి చేయబోతున్న గ్రీన్ అమ్మోనియా సౌకర్యాలకు 4,500 మెగావాట్ల కార్బన్ రహిత శక్తిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒప్పందంపై సీఐఎల్ జీఎం (ఈ అండ్ ఎం) సుదర్శన్ బోరా, ఏఎం గ్రీన్ బిజినెస్ డెవలప్‌మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శతన్షు అగర్వాల్ ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు చేశారు.
దేశవ్యాప్తంగా భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ జరపాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్‌ల్లో సోలార్ పవర్ కెపాసిటీని 2,500 మెగావాట్ల నుంచి 3,000 మెగావాట్ల వరకు పెంచాలని నిర్ణయించారు. 1,500 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని 2,000 మెగావాట్లకు విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకోసం దక్షిణ భారతదేశంలో అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. ఈమేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఏఎం గ్రీన్ ఈ పునరుత్పాదక శక్తిని పంప్డ్ హైడ్రో స్టోరేజీతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి సౌకర్యాలకు స్థిరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాను ఇది నిర్ధారిస్తుంది. గ్రీన్‌కో గ్రూప్ ప్రమోటర్లు స్థాపించిన ఏఎం గ్రీన్ 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్‌కు సమానం. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంలో 20%గా ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
ఈ సందర్భంగా సీఐఎల్ సుస్థిరమైన ఎనర్జీని సరఫరా చేసేందుకు కట్టుబడి ఉందని సంస్థ ఛైర్మన్ పీ.ఎం.ప్రసాద్ తెలిపారు. భారతదేశ ఇంధన తయారీలో బొగ్గు కీలక భాగంగా ఉన్నప్పటికీ, సీఐఎల్ గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈమేరకు కంపెనీ చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్‌కో అండ్ ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి ఈ ప్రాజెక్టుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఇతర గ్రీన్ మాలిక్యూల్స్ తయారీలో గణనీయంగా ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్-ఫ్రీ, పునరుత్పాదక ఇంధన సరఫరాదారుగా ఉన్న సీఐఎల్‌తో జతకట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.